నెత్తుటి దారిగా హైదరాబాద్ - విజయవాడ హైవే.. నెలకు సగటున 113 ప్రమాదాలు!

by Jakkula.Mamatha |

దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నిత్యం నెత్తురోడుతుంది.

నెత్తుటి దారిగా హైదరాబాద్ - విజయవాడ హైవే.. నెలకు సగటున 113 ప్రమాదాలు!
X

దిశ, నార్కట్ పల్లి: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నిత్యం నెత్తురోడుతుంది. నల్లగొండ జిల్లా పరిధిలో 160 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ హైవే.. వాహనదారుల పాలిట మృత్యు శాపంగా మారిందని చెప్పవచ్చు. ప్రమాదాలను తగ్గించేందుకు 300 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించిన ఫలితం లేకుండా పోతుంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడపడమే ఇందుకు ప్రధాన కారణం. వీటన్నింటికి తోడు అధికారులు, పాలకుల అలసత్వంతో ఈ మార్గం డెత్ కారిడార్ ను తలపిస్తోంది. ఈ జాతీయ రహదారి పై భద్రతా లోపాలకు గత వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వస్తున్న ఓ వాహనం టైరు పేలి అదుపుతప్పి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అభం శుభం తెలియని ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన మర్చిపోకముందే ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం భద్రతా లోపాలకు సజీవ సాక్ష్యం గా నిలుస్తుంది. ఇలా నిత్యం ఈ రహదారిపై ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూ అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

సగటున నెలకు 113 ప్రమాదాలు..

ఈ జాతీయ రహదారిపై నిత్యం 40 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇందులో కార్లు, లారీలతో పాటుగా భారీ వాహనాలు, వీఐపీల రాకపోకలు సైతం ఈ రహదారిపై అధికంగానే ఉంటుంది. రద్దీకి తగ్గట్లుగా భద్రత ప్రమాణాలు లేకపోవడంతో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఈ ప్రమాదాలతో ఈ రహదారి నిత్యం రక్తపుటేరులై పారుతోందని చెప్పొచ్చు. నెలకు సగటున 113 ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా అందులో 51 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. గడచిన ఐదేళ్లలో పోలీసులు, రవాణా శాఖ అధికారుల అధ్యయనం ప్రకారం నల్లగొండ సూర్యాపేట జిల్లాలో రహదారులపై 8196 ప్రమాదాలు జరగగా 3673 మంది మృతి చెందారు. 487 మంది తీవ్ర గాయాల పాలైనట్లు తెలుస్తోంది. గడచిన 72 నెలల్లో చూస్తే నల్లగొండ జిల్లాలో 4941 ప్రమాదాలు జరగగా 2215 మంది మృతిచెందగా, 171 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో చూస్తే 3255 ప్రమాదాలు జరగగా 1458 మంది మృతిచెందగా, 316 మంది తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు చేపట్టిన గణాంకలో అత్యధికంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చోటు చేసుకోవడం రోడ్డు భద్రతకు అద్దం పడుతుందని చెప్పవచ్చు. ఈ రహదారిపై ఉన్నటువంటి బ్లాక్ స్పాట్లలో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నట్లు తెలుస్తోంది.

సాగుతున్న రోడ్డు మరమ్మతు పనులు..

ప్రమాదాలను నివారించేందుకు ఈ రహదారిపై 300 కోట్ల రూపాయలతో మరమ్మత్తు పనులను గత రెండేళ్ల క్రితం ప్రారంభించారు. అయినా నేటికీ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న తీరుగా పనులు సాగుతున్నాయి. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం ప్రయాణికులకు ఒక సాహస యాత్ర గానే సాగుతుందని చెప్పవచ్చు.. చిట్యాల, పెద్ద కాపర్తి సమీపంలో, చౌటుప్పల్ పట్టణంలో నిర్మించే ఫ్లై ఓవర్ల వల్ల ప్రయాణం ఇబ్బందికరంగా మారుతుంది. శని ఆదివారాల్లో 10 కిలోమీటర్లు ముందుకు వెళ్లాలంటే రెండు గంటలు పడుతుందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. చిట్యాల పట్టణంలో సర్వీస్ రోడ్లపై బస్సులు నిలపడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అదేవిధంగా చౌటుప్పల్ పట్టణంలో సర్వీస్ రోడ్డు చిన్నదిగా ఉండటం వల్ల రాకపోకలకు ఇబ్బంది జరుగుతుంది. ఏడాదిన్నరలో పూర్తి చేయాల్సిన ఈ మరమత్తు పనులు రెండేళ్లయినా పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. దీనంతటికీ పాలకుల పట్టింపు లేని తనమే కారణమని తెలుస్తోంది.

ప్రమాదం జరిగితే ప్రాణాలు గాల్లోకి..

ఈ జాతీయ రహదారిపై అధికారుల పట్టింపు లేని తనం వల్ల వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయి. దీంతో ప్రమాదం జరిగితే వెంటనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అని చెప్పవచ్చు. వీటన్నింటికి తోడు డివైడర్ ఎత్తుగా లేకపోవడంతో ఇటీవల చోటు చేసుకున్న రెండు ప్రమాదాల్లో అపసవ్య దిశలో వెళ్తున్న వాహనాలకు ఢీకొని మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అదేవిధంగా ఈ రహదారిపై ఎక్కడ ట్రామా కేర్ సెంటర్ లేకపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందించడం కష్టతరంగా మారుతుంది. టోల్ పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రయాణికులకు వసతులు కల్పించడం లేదు. ఇకనైనా అధికారులు పాలకులు ఈ రహదారిపై దృష్టి సారించి ప్రమాదాల నివారణను తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Next Story