గుండె దడకు గుడ్‌బై.. 31 ఏళ్ల యువకుడు, 84 ఏళ్ల వృద్ధుడికి విజయవంతమైన పీఎఫ్ఏ చికిత్స

by Ramesh Naini |

గుండె దడకు గుడ్‌బై.. 31 ఏళ్ల యువకుడు, 84 ఏళ్ల వృద్ధుడికి విజయవంతమైన పీఎఫ్ఏ చికిత్స
X

దిశ, తెలంగాణ బ్యూరో: గుండె రిథమ్ వ్యాధుల చికిత్సలో యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్న అత్యాధునిక ‘పల్స్ ఫీల్డ్ అబ్లేషన్’ (పీఎఫ్ఏ) సాంకేతికతను ఆస్పత్రిలో విజయవంతంగా ప్రారంభించారు. మెడ్‌ట్రానిక్ అభివృద్ధి చేసిన పల్స్ సెలెక్ట్ పీఎఫ్ఏ సిస్టం సహాయంతో క్లిష్టమైన గుండె రిథమ్ లోపాలతో బాధపడుతున్న 31 ఏళ్ల యువకుడికి, అలాగే 84 ఏళ్ల వృద్ధుడికి వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు.

సురక్షితమైన.. విప్లవాత్మక సాంకేతికత

సాధారణంగా గుండె దడ, ఆయాసం వంటి లక్షణాలతో బాధపడే ‘ఏట్రియల్ ఫైబ్రిలేషన్ (ఏఎఫ్)’ రోగులకు ఈ పీఎఫ్ఏ చికిత్స ఒక వరంగా మారనుంది. ఇది నియంత్రిత విద్యుత్ పల్స్ ద్వారా గుండెలో అసాధారణ విద్యుత్ సంకేతాలను సృష్టించే కణజాలాన్ని మాత్రమే అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకొని చికిత్స అందిస్తోంది. పాత థర్మల్ అబ్లేషన్ పద్ధతులతో పోలిస్తే ఈ సరికొత్త సాంకేతికత ద్వారా గుండెకు సమీపంలో ఉండే అన్నవాహిక, ఫ్రెనిక్ నర్వ్ వంటి ఇతర ముఖ్యమైన అవయవాలకు హాని కలిగే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల చికిత్స మరింత సురక్షితంగా ఉండటమే కాకుండా, రోగులు చాలా వేగంగా కోలుకుని తమ సాధారణ జీవితాన్ని గడపవచ్చు.

ఇద్దరికి పునర్జన్మ

పదేపదే గుండెదడ, ఆయాసంతో బాధపడుతూ హాస్పిటల్‌లో చేరిన 31 ఏళ్ల యువకుడిని పరీక్షించగా, అతనికి ‘పరోక్సిస్మల్ ఏట్రియల్ ఫైబ్రిలేషన్’ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అలాగే తీవ్రమైన ఆయాసంతో చేరిన 84 ఏళ్ల వృద్ధుడికి ‘నిరంతర ఎట్రియల్ ఫైబ్రిలేషన్’ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. యశోద హాస్పిటల్స్ సీనియర్ కార్డియాక్ ఎలక్ట్రో ఫి జియాలజిస్ట్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎంఎన్ చంద్రమౌళి నేతృత్వంలోని ఎలక్ట్రో ఫిజియాలజీ బృందం ఈ ఇద్దరు బాధితులకు పీఎఫ్ఏ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించారు. ప్రస్తుతం ఇద్దరి గుండె స్పందనలు సాధారణ స్థితికి చేరుకోవడంతో వారు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

రోగుల భద్రతే లక్ష్యం

ఈ సందర్భంగా డాక్టర్ ఎంఎన్ చంద్రమౌళి మాట్లాడుతూ.. గుండె రిథమ్ వ్యాధుల చికిత్సలో పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ ఒక విప్లవాత్మక ముందడుగు అని, అంతర్జాతీయ స్థాయి వైద్య సాంకేతికతను మన దేశీయ రోగులకు అందుబాటులోకి తీసుకురావడమే యశోద హాస్పిటల్స్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సరికొత్త విధానం ద్వారా రోగులకు గరిష్ట భద్రతతో పాటు వేగంగా కోలుకునే అవకాశం లభిస్తుందన్నారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్స్ కార్డియాక్ ఎలక్ట్రో ఫిజియాలజీ విభాగంలో గుండె రిథమ్ లోపాలకు సంబంధించిన కాంప్లెక్స్ అబ్లేషన్ విధానాలు, పేస్మేకర్ అమరిక, ఐసీడీలు, సీఆర్టీ పరికరాలు, హార్ట్ ఫెయిల్యూర్‌కు సంబంధించిన అన్ని అత్యాధునిక చికిత్సలు నిపుణుల పర్యవేక్షణలో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

Next Story