ఏపీ హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ ప్రశ్న రావణ్.. తాజాగా మరో అరెస్ట్!

by Ramesh Naini |

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వరుస అరెస్టులు ఎదుర్కొంటున్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న రావణ్’ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ ప్రశ్న రావణ్.. తాజాగా మరో అరెస్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వరుస అరెస్టులు ఎదుర్కొంటున్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న రావణ్’ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court)ను ఆశ్రయించారు. తనపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన పిటిషన్‌లో న్యాయస్థానాన్ని కోరారు. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)తో విచారణ జరిపించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై సోమవారం (రేపు) హైకోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం.

ప్రతివాదులుగా ప్రభుత్వం

జోసెఫ్ తన పిటిషన్‌లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీతో పాటు ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు. అలాగే ఆయనపై కేసులు నమోదైన పాయకరావుపేట, పిఠాపురం, మచిలీపట్నం, సర్పవరం పోలీస్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లను (SHOs) కూడా ప్రతివాదులుగా పేర్కొన్నట్లు తెలిసింది.

వరుస అరెస్టుల పర్వం.. తాజాగా గన్నవరంలో..

పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జోసెఫ్‌పై రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ను వరుసగా అరెస్టు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జోసెఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మచిలీపట్నం నుంచి ఆయన్ను నక్కపల్లి రూరల్‌ సర్కిల్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గన్నవరం స్టేషన్‌లో నమోదైన కేసులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున ప్రశ్న రావణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్టై బెయిల్ పొందిన ప్రశ్న రావణ్.. తాజాగా ఐదోసారి పోలీసుల అదుపులో ఉండటంతో ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. అరెస్టులు, బెయిల్స్ పర్వం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

Next Story