- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆపరేషన్ కగార్’ వ్యతిరేకులను కలుస్తున్నాం.. సీపీఎం నేతలతో మాజీ మావోయిస్ట్ దేవ్‌జీ బృందం భేటీ
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, పెట్టుబడిదారుల దోపిడీపై కలిసికట్టుగా పోరాడుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, పెట్టుబడిదారుల దోపిడీపై కలిసికట్టుగా పోరాడుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ‘ఎంబీ భవన్’లో పార్టీ ప్రతినిధులతో మాజీ మావోయిస్టులు దేవ్‌జీ, రాజిరెడ్డి, చంద్రన్న, పద్మక్క, సంజీవ్, బండి ప్రకాశ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా ఉద్యమాలపై సుమారు రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ అనంతరం జాన్‌వెస్లీ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మావోయిస్టులను ఏరివేయాలనే నెపంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 'ఆపరేషన్ కగార్'ను చేపట్టి, నరమేధాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీరును సీపీఐ(ఎం)తో పాటు ఇతర వామపక్షాలు, ప్రజాస్వామిక వాదులు మొదటి నుంచి ఖండిస్తున్నారని గుర్తుచేశారు. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు ప్రజా ఉద్యమాల్లో నిలబడి ముందుకు రావాలన్నారు. వారిపై ఉన్న ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మిగిలిపోయిన మావోయిస్టులపై నిర్బంధాన్ని ఆపాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కులు, మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని, తమతో కలిసి వచ్చే ప్రతి ఒక్కరినీ సీపీఎం ఆహ్వానిస్తుందని స్పష్టం చేశారు.
మర్యాదపూర్వకంగానే కలిశాం: దేవ్‌జీ
ఆపరేషన్ కగార్‌ను ఆపాలని, కర్రెగుట్టలో నిర్బంధాన్ని తొలగించాలని, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని వామ పక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపాయని మాజీ మావోయిస్టు దేవ్‌జీ పేర్కొన్నారు. తాము ప్రజా జీవితంలోకి వచ్చాక.. ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకించిన రాజకీయ పార్టీల నాయకులందరినీ కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఇటీవల సీపీఐ కార్యాలయానికి, ఇప్పుడు సీపీఎం కార్యాలయానికి వచ్చామని చెప్పారు. కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించడం లేదా ఏదైనా పార్టీలో చేరడం వంటి అంశాలపై చర్చించడానికి ఇది సరైన సందర్భం కాదని దేవ్‌జీ స్పష్టం చేశారు. ఈ భేటీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌రావు, టి.సాగర్, ఎండీ అబ్బాస్, సీనియర్ నాయకులు జి.రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.శ్రీరాం నాయక్, టి.స్కైలాబ్‌బాబు, మల్లు నాగార్జునరెడ్డి, పి.ఆశయ్య, ఉడుత రవీందర్, నాయకులు ధర్మ నాయక్, కోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.






