- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులున్నా.. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం : మంత్రి వివేక్
ఆర్థిక కష్టాలున్నా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.

దిశ, అక్బర్ పేట భూంపల్లి: ఆర్థిక కష్టాలున్నా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ సీజన్లో వచ్చే దానికంటే వరి ధాన్యం 30 శాతం అధికంగా పండిందని, రైతులు అధైర్యపడవద్దని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. గురువారం అక్బర్ పేట భూంపల్లి మండలం నగరంలో ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన దుబ్బాక నియోజకవర్గం లోని 594 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.5 కోట్ల 94 లక్షల 68 వేల 904 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. హైమావతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రం తో కలిసి ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి సొంతింటి కళ నెరవేర్చడానికి జిల్లాలో దాదాపు 10 వేల ఇండ్లు మంజూరు చేయగా, 80 శాతం గ్రౌండింగ్ అయ్యాయని, 5 వేలు ఇండ్లు స్లాబ్ లు పడి నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని, ఈ ఏడాది కూడా ఇండ్లు సాంక్షన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇల్లు కట్టుకున్నాక ఇంటి సభ్యుల సౌలభ్యం కోసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ.. ఇప్పటివరకు రూ.158 కోట్లు డిస్కౌంట్ ను విద్యుత్ శాఖకు ప్రభుత్వం కట్టడం జరిగిందని వెల్లడించారు. ఉచిత బస్సు సౌకర్యం ద్వారా జిల్లాలో ప్రయాణించిన మహిళలకు గాను రూ.300 కోట్లను ఆర్టీసీ యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని స్పష్టం చేశారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డులు 45వేల పైగా మంజూరు చేయడంతో పాటు కుటుంబ సభ్యుల చేరికలు సైతం చేశామని, అలాగే ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఏ పథకం రావాలన్న ప్రతిదీ రేషన్ కార్డుతోనే ముడిపడి ఉందని, పెద్ద ఎత్తున రేషన్ కార్డులు కూడా అందజేశామన్నారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల బీమా కల్పించడం జరిగిందని, కొత్త పింఛన్లు కోసం ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగిందని వాటిని కూడా త్వరలోనే ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. స్కూల్ పిల్లలకు కొత్తగా బ్రేక్ ఫాస్ట్ పథకం అమలుకు శ్రీకారం చుట్టామని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని వివరించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పనులు మొదలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లు విద్యార్థులకు మంచి నైపుణ్యాల తో పాటు ఉపాధి అందించడం జరుగుతుందని, రాష్ట్రం లో 56 కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లను ప్రారంభించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లలో సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఓ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ అందించి, రాష్ట్రంలోనే కాకుండా బయట దేశాలకు సైతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కోసం విద్యార్థుల స్కిల్, భాష ప్రతిదీ నేర్పించడం జరుగుతుందన్నారు. యూరియా, డిఏపి కొరత లేదని, అధునాతన యాప్ ద్వారా కొనుగోలు సులభంగా చేయవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని రైతులకు విజ్ఞప్తి చేశారు. దుబ్బాక ఏంఎల్ఏ మాట్లాడుతూ… దేశంలోనే గొప్ప కార్యక్రమం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ వల్ల లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ లో మెయిన్ కెనాల్ పూర్తి, సబ్ కెనాల్ కి సంబంధించి భూ సేకరణకు బకాయిలను విడుదల చేయాలని, దుబ్బాక నియోజకవర్గం లో గో-డౌన్ లను నిర్మించుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ కోసం 27 ఎకరాలు కేటాయించామని, వెంటనే శాంక్షన్ చేసి పనులు ప్రారంభించాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సంగీత రవీందర్, ఆర్డీఓ సదానందం, ఆయా మండలాల మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






