- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీతి ఆయోగ్ హౌస్‌ఫుల్.. చాలా గ్యాప్ తర్వాత మొత్తం 28 రాష్ట్రాల సీఎంలూ హాజరు
నీతి ఆయోగ్ హౌస్‌ఫుల్. చాలా గ్యాప్ తర్వాత మొత్తం 28 రాష్ట్రాల సీఎంలూ హాజరయ్యారు. యువత, మహిళల్లో నైపుణ్యాల పెంపు, ఉద్యోగాల సృష్టిపై ఫోకస్ పెట్టాలని మోడీ చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇటీవలి కాలంలో పలురాష్ట్రాల సీఎంలు ఈ భేటీని బాయ్‌కాట్ చేస్తూ వచ్చిన నేపథ్యంలో.. ఈసారి మొత్తం 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనడం గమనార్హం. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో ఈ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళం నుంచి వీడీ సతీశన్, జమ్మూకశ్మీర్ నుంచి ఒమర్ అబ్దుల్లా తదితర విపక్ష నేతలు కూడా హాజరయ్యారు. వీరితోపాటు కేంద్రాపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్రమంత్రులు కూడా భేటీలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, జమ్మూకశ్మీర్ సీఎంలు వ్యక్తిగతంగా ప్రధాని మోడీని కలిశారు. ఏటా జరిగే ఈ భేటీకి గతేడాది నలుగురు సీఎంలు, 2024లో పది మంది, 2023లో తొమ్మిది మంది ముఖ్యమంత్రులు డుమ్మాకొట్టారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా చాలామంది సీఎంలు, ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు ఈ భేటీని బాయ్‌కాట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అందరు ముఖ్యమంత్రులు హాజరై తమ ఆలోచనలను పంచుకోవడం గమనార్హం. సమావేశానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న ప్రధాని మోడీ.. ‘ఫెడరలిజం స్ఫూర్తిలో నడుస్తూ భారత అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు మేమంతా కలిసి పనిచేస్తున్నాం. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి కృషి చాలా కీలకం’ అని పేర్కొన్నారు.
అనిశ్చితిలోనూ బలమైన వృద్ధి
అంతర్జాతీయంగా అనిశ్చితి అలముకొని ఉన్నప్పటికీ భారత్ బలంగా ముందుకెళ్తోందని, నమ్మకంగా ఎదుగుతోందని ఈ భేటీలో ప్రధాని మోడీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి అందరూ కలిసి బాధ్యత తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ‘ప్రపంచంలో అనిశ్చితి, అస్థిరత కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో కూడా భారత ఎదుగుదల బలంగా ఉంది’ అని మోడీ చెప్పినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. అలాగే చాలా దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, తద్వారా దేశంలో ఎదుగుదలకు అవకాశాలు, ఎగుమతులను పెంచేందుకు వీలు కల్పించిందని మోడీ వెల్లడించారు. ‘మన ఎంఎస్ఎంఈలకు ఈ ఒప్పందాలు మంచి అవకాశాలు సృష్టిస్తాయి. అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ గ్లోబల్ మార్కెట్ల కోసం ప్రయత్నించడం వల్ల పోటీతత్వం కూడా పెరుగుతుంది’ అని వివరించారు. నాణ్యమైన విద్య, డిమాండ్‌ను బట్టి నైపుణ్యాలు, ఉద్యోగావకాశాల సృష్టిపై ఫోకస్ పెట్టాలని, తద్వారా యువత ఎదుగుదలకు అవసరమైన పరిస్థితులను సృష్టించాలని ప్రధాని పేర్కొన్నారు. సాధికార యువతే దేశం వికసిత్ భారత్‌గా మారడానికి ఇంధనంలా మారతారన్నారు. రాష్ట్రాల మధ్య బంధాలు సహకారం, చర్చలతో నడవాలని సూచించారు. దీంతోపాటు కేంద్రంతో సహకారాన్ని పెంచడంలో కూడా నీతి ఆయోగ్ కీలక వేదికగా ఉంటుందని తెలియజేశారు. మహిళల నేతృత్వంలోని అభివృద్ధి ‘వికసిత్ భారత్’కు మూలమన్న పీఎం.. వ్యవసాయం నుంచి స్టార్టప్‌లు, సైన్స్ అండ్ ఇన్నొవేషన్ సహా అన్ని రంగాల్లో మహిళలు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. వారి పూర్తి సామర్థ్యాలను వెలికితీసేందుకు విద్య, నైపుణ్యాలు, భద్రత, మహిళా సాధికారతపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని సూచించారు.
ఎల్‌నినోపై ఆందోళన..
ఈ భేటీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ వర్షాకాలంపై ఎల్‌నినో ప్రభావాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో ఉన్న ఆందోళనలను వివరించిన ఆయన.. రాష్ట్రాలు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని, సహజమైన ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఖరీఫ్ సీజన్‌లో 11 లక్షల టన్నుల సహజ ఎరువులను రైతులు కొనుగోలు చేశారని, ఇది పర్యావరణహిత వ్యవసాయంపై పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తోందన్నారు.






