ఎక్కువ పని చేస్తున్నావ్‌ అని తిట్టిన బాస్.. ఎక్క‌డంటే?

by Thanuru Gopichand |

ఎక్కువ పని చేస్తున్నావ్‌.. వెంటనే లంచ్ చెయ్, సెలవులు తీసుకో అని ఒక బాస్ తన ఉద్యోగిని మందలించడం ఎక్కడైనా చూశారా?

ఎక్కువ పని చేస్తున్నావ్‌ అని తిట్టిన బాస్.. ఎక్క‌డంటే?
X

దిశ‌, నేష‌న‌ల్ బ్యూరో: ఎక్కువ పని చేస్తున్నావ్‌.. వెంటనే లంచ్ చెయ్, సెలవులు తీసుకో అని ఒక బాస్ తన ఉద్యోగిని మందలించడం ఎక్కడైనా చూశారా? కార్పొరేట్ కంపెనీలలో అర్ధరాత్రి దాకా ఆఫీసుల్లో మగ్గిపోతూ, ఒంట్లో బాగోలేకపోయినా బాస్ మెప్పు కోసం హీరోలా శ్రమించే వర్క్ కల్చర్‌కు నార్వే దేశంలో అస్సలు చోటు లేదని నిరూపించే ఘటన ఇది. ఉద్యోగం కోసం 15 ఏళ్ల క్రితం నార్వేకు వలస వెళ్లిన వినోద్ అనే భారతీయ టెక్కీ.. ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’ విషయంలో తనకు ఎదురైన ఒక వింత అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, అదిప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

భారతదేశంలో అలవాటైనట్లుగానే వీకెండ్‌లలో పని చేయడం, లంచ్‌లు మానేసి డ్యూటీ చేయడం, జ్వరం వచ్చినా ప్రాజెక్ట్ కోసం సెలవు క్యాన్సిల్ చేసుకోవడం వంటి పనులను వినోద్ నార్వేలోనూ కొనసాగించాడు. దీనితో ఆఫీసులో తనను అందరూ మెచ్చుకుంటారని వినోద్ భావించగా.. సీన్ రివర్స్ అయింది. అతని బాస్ రూమ్‌లోకి పిలిపించి ‘శనివారం మెయిల్‌కు ఎందుకు రిప్లై ఇచ్చావు? సెలవు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావు? ఇక్కడ సెలవు తీసుకోవడం చట్టప్రకారం తప్పనిసరి. నిన్ను చూసి జూనియర్లు కూడా ఇదే అంకితభావం అనుకుని జీవితాలను పాడు చేసుకుంటారు. ఎక్కువ పని చేయడం ఇక్కడ పెద్ద సమస్య’ అంటూ క్లాస్ పీకారు. బాస్ మాటలతో షాక్‌కు గురైన వినోద్.. కార్పొరేట్ బానిసత్వంలో తాను కోల్పోయిన జీవితాన్ని, మానసిక ప్రశాంతతను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ పోస్ట్‌పై భారతీయ నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. ‘నార్వే లాంటి దేశాల్లో వాళ్లు జీవితాన్ని అనుభవిస్తున్నారు. మన దేశంలో కార్పొరేట్ సంస్థ‌లు ఉద్యోగుల రక్తాన్ని పిండుకుంటున్నాయ‌ని’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన జ్వరం వచ్చి హాస్పిటల్‌లో చేరినా జీతాలు కట్ చేసే దేశీయ బాస్‌ల దారుణాలను పలువురు నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

Next Story