వరద వస్తున్నా.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటిమట్టం ఆందోళనకరమే

by Malleboina Mahesh |

కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రధాన జలాశయాలకు వరద నీరు చేరుతన్నప్పటికి నీటి నిల్వలు పూర్తి సామర్థ్యం ఆందోళనకరం.

వరద వస్తున్నా.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటిమట్టం ఆందోళనకరమే
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రధాన జలాశయాలకు వరద నీరు చేరుతుంది. అయితే.. ఎగువన ఉన్న కొన్ని ప్రాజెక్టుల్లో ప్రవాహాలు పెరుగుతున్నప్పటికీ, తెలంగాణలోని కీలక జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి నిల్వలు పూర్తి సామర్థ్యం తో పోలిస్తే ఇంకా చాలా తక్కువగానే ఉన్నాయి. తెలంగాణ, ఏపీకి సంబంధించిన ప్రధాన జలాశయాల కలిపిన స్థూల నిల్వ సామర్థ్యం 793.94 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 269.27 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. అంటే మొత్తం సామర్థ్యంలో కేవలం 33.92 శాతం మాత్రమే నిల్వ ఉండటం గమనార్హం. గతేడాది ఇదే తేదీతో పోలిస్తే ఈసారి నిల్వలు ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నాయి.

శ్రీశైలం, సాగర్‌లో 20 శాతంలోపే..

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 820.80 అడుగులు మాత్రమే ఉన్నది. మొత్తం నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 41.40 టీఎంసీలుగా ఉంది. 24 గంటల్లో సగటున 163 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే నమోదైంది. ప్రాజెక్టు నుంచి 1,501 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి 590 అడుగులు కాగా ప్రస్తుతం 513.20 అడుగుల నీటి మట్టం నమోదైంది. మొత్తం 312.05 టీఎంసీల సామర్థ్యంలో ప్రస్తుతం 137.17 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. 24 గంటల్లో 4,970 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

తెలంగాణ ప్రాజెక్టుల్లో పరిస్థితి..

సింగూర్‌లో ప్రస్తుతం 4.31 టీఎంసీలు, నిజాంసాగర్‌లో 6.49 టీఎంసీలు, శ్రీరాంసాగర్‌లో 15.99 టీఎంసీలు, మిడ్ మానేరు 7.46 టీఎంసీలు, లోయర్ మానేరు 5.45 టీఎంసీలు, కడెం 0.71 టీఎంసీలు, శ్రీపాద ఎల్లంపల్లి 8.09 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ జలాశయాల్లోకి పరిమిత స్థాయిలోనే వరద ప్రవాహాలు వస్తున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి గత 24 గంటల్లో 73,461 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. నారాయణపూర్‌కు 31,568 క్యూసెక్కులు, ఉజ్జయిని ప్రాజెక్టుకు 69,492 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. జూరాలకు మాత్రం కేవలం 24,013 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. గోదావరి డెల్టా కాలువలకు మొత్తం 14,900 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు డెల్టాలకు 54.80 టీఎంసీల నీటిని వినియోగించారు. కృష్ణా డెల్టాలో ఈస్టర్న్ మెయిన్ కెనాల్‌కు 3,014 క్యూసెక్కులు, వెస్టర్న్ మెయిన్ కెనాల్‌కు 1,640 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

జూరాలకు 30 వేల క్యూసెక్కుల వరద- నీటి నిల్వ 8.909 టీఎంసీలకు చేరిక

దిశ, గద్వాల : ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రియదర్శిని జూరాల (పీజేపీ) డ్యామ్‌కు సోమవారం రాత్రి 9 గంటల నాటికి 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. స్పిల్‌వే గేట్లు ఎత్తాల్సిన అవసరం రాకపోవడంతో వాటిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. డ్యామ్‌లో ప్రస్తుతం 318.15 మీటర్లు (1,043.799 అడుగులు) నీటిమట్టం నమోదైంది. మొత్తం నీటి నిల్వ 8.909 టీఎంసీలు కాగా, లైవ్ స్టోరేజ్ 5.202 టీఎంసీలుగా ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, పూర్తి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. డ్యామ్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 750 క్యూసెక్కులు, భీమా ఎత్తిపోతల మొదటి దశకు 1,300 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి 315 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో మొత్తం నీటి విడుదల 16,408 క్యూసెక్కులకు చేరింది. స్పిల్‌వే గేట్లు, ఎడమ, కుడి ప్రధాన కాలువలు, ఆర్‌డీఎస్ లింక్ కాలువ, ప్యారలల్ కాలువల ద్వారా ప్రస్తుతం ఎలాంటి నీటి విడుదల లేదని అధికారులు వెల్లడించారు.

Next Story