- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్రకు నీళ్లు.. ఏపీకి నిధులు.. ‘తెలంగాణ ఉద్యమ నినాదం’ దారి మళ్లుతోందా..?
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నడిచింది.

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నడిచింది. కానీ ప్రస్తుతం అది దారి మళ్లుతున్నదని స్పష్టమవుతున్నది. అవసరమైతే మహారాష్ట్రకు శ్రీరాంసాగర్ నుంచే గోదావరి జలాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం, తాజాగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం సింగరేణి సంపదను ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తుండటం ఇందుకు బలం చేకూర్చుతున్నది.
ప్రభుత్వ నిర్ణయాలపై సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉద్యమ సమయంలో ఏపీకి నిధులు తరలిపోవడంపై రాద్ధాంతం చేసిన గులాబీ పార్టీ.. ఇప్పుడు ఒక విధాన నిర్ణయంగానే సింగరేణి నుంచి నిధులను విశాఖ స్టీల్‌కు తరలించడానికి సిద్ధం కావడంలోని ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర, ఏపీ లో బీఆర్ఎస్ విస్తరణ, ప్రయోజనాల కోసమే తెలంగాణ సంపదను ఆ రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : నీళ్లు, నిధులు, నియామకాలు.. ప్రధానంగా ఈ మూడు అంశాలపైనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నడిచింది. ఈ మూడు ఏపీ ప్రాంతానికి దక్కుతున్నాయని, వీటిలో తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ ప్రజలు భావించారు. మలిదశ ఉద్యమంలో ఈ మూడు అంశాలే సబ్బండ వర్ణాలను ఏకం చేశాయి. కానీ ఇటీవల గోదావరి జలాలను మహారాష్ట్ర వాడుకోవచ్చంటూ సీఎం చేసిన ప్రకటన, తాజాగా వైజాగ్‌లోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోడానికి సింగరేణి సంస్థ నిధులను వాడేందుకు సిద్ధమపడటం వంటివి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.
ఇక్కడి నీళ్లు, నిధులు ఏపీ ప్రాంతానికి వెళ్లిపోవడాన్ని ప్రస్తావించి నాడు ఉద్యమం చేస్తే.. ఇప్పుడు ప్రభుత్వమే వీటిని తరలించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నీళ్లు మహారాష్ట్రకు, నిధులు ఏపీ రాష్ట్రానికి ఇక్కడి ప్రభుత్వం ఇస్తున్నట్టు వస్తున్న ప్రకటనలపై సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. సింగరేణి పూర్తిగా తెలంగాణ ప్రాంతానికి చెందినది కావడంతో ఇక్కడి నిధులను ఇతర రాష్ట్రంలో పెట్టుబడిగా పెట్టడంపై ఫైర్ అవుతున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో సింగరేణి నిధులను పెట్టడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి జరిగే ప్రయోజనమేంటని సూటిగానే ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సంపద ఏపీకి తరలుతున్నదని ఉద్యమం సమయంలో ఆరోపించిన నేతలే ప్రస్తుతం అధికారికంగా సింగరేణి నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం వెచ్చించడాన్ని తప్పుపడున్నారు. ఇప్పటికే కాంట్రాక్టులు ఏపీ వ్యక్తులకు వెళ్లాయని, మంత్రి పదవులు తెలంగాణ వ్యతిరేకులకు దక్కాయని కొన్ని ఉదాహరణలతో గుర్తుచేస్తున్నారు.
‘అవసరమైతే మహారాష్ట్రకు శ్రీరాంసాగర్ నుంచే గోదావరి జలాలను ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం..’ అని ఫిబ్రవరి 5న నాందేడ్ పర్యటన సందర్భంగా మీడియా సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనే నిజామాబాద్ జిల్లా రైతాంగం నుంచి విమర్శలు వచ్చాయి. తెలంగాణ రైతులను కాదని మహారాష్ట్రకు నీళ్లు ఇచ్చే అధికారాన్ని కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారని విపక్ష నేతలు ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. కృష్ణా జలాలను ఏపీ వాడుకుంటూ ఉంటే మౌనంగా ఉండిపోయిన సీఎం.. ఇప్పుడు సింగరేణి సంపదనూ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఖర్చు పెట్టడాన్ని తప్పుపడుతున్నారు.
వైజాగ్ స్టీల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అధికారులతో కూడిన ప్రతినిధి బృందం విశాఖపట్నం వెళ్లడం వివాదాస్పదమైంది. ఉద్యమం సమయంలో ఏపీకి నిధులు తరలిపోవడంపై రాద్ధాంతం చేసిన గులాబీ పార్టీ ఇప్పుడు ఒక విధాన నిర్ణయంగానే సింగరేణి నుంచి నిధులను తరలించడానికి సిద్ధం కావడంలోని ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నియామకాల విషయంలోనూ 80 వేల ఉద్యోగాలకు సీఎం అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చి ఏడాది దాటినా ఇంకా అవి నోటిఫికేషన్లు, పరీక్షల దశలోనే ఉండడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు చివరికి ఇలా తయారయ్యాయంటూ ఉద్యమకారులు, నిరుద్యో్గులు, రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీల నేతలు కూడా బహిరంగంగానే కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూనే టెండర్?
ఒకవైపు వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూనే టెండర్ ప్రక్రియలో పాల్గొనడాన్ని తెలంగాణ ప్రజలు తప్పుపడుతున్నారు. టెండర్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయడమంటేనే ప్రైవేటీకరణను సమర్ధించడం అనే లాజిక్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పార్టీల నేతలు ఇదే తరహా విమర్శలు చేస్తున్నారు. సింగరేణికి దక్కిన ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌ను సొంతంగా వాడుకోకుండా అరబిందో కంపెనీకి కట్టబెట్టిందంటూ తెలంగాణ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్... నైని కోల్ బ్లాక్ విషయంలో తన ద్వంద్వ విధానంపై వివరణ ఇవ్వాలని ఈటల రాజేందర్, డీకే అరుణ ఇప్పటికే డిమాండ్ చేశారు.
ఏపీలో పాలిటికల్ ఎంట్రీ కోసమేనా?
ఇదిలా ఉండగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న వాదనపై తెలంగాణలో తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం తెలంగాణకు మాత్రమే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను విస్తరించుకోడానికే సింగరేణి నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఖర్చు చేస్తున్నదంటూ పలువురు పొలిటీషియన్లు విమర్శిస్తున్నారు. తెలంగాణలో మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించడంపై శ్రద్ధ లేని కేసీఆర్.. పక్క రాష్ట్రంలోని ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటారట అంటూ సెటైర్లు వేశారు.
పొలిటికల్ డ్రామా కోసమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఎత్తుకున్నారని, ఈ సాకుతో అక్కడి ప్రజల సెంటిమెంట్‌ను వాడుకోవాలనుకుంటున్నారని, పార్టీ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే దురుద్దేశమున్నదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో ఎంట్రీ కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని, మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ కోసం గోదావరి జలాలను శ్రీరాంసాగర్ ద్వారా లిప్టు చేసుకోవచ్చనే హామీని కేసీఆర్ వాడుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు సైతం విమర్శించారు. గోదావరి జలాలను మహారాష్ట్రకు ఇవ్వనున్నట్టు కేసీఆర్ చేసిన ప్రకటనను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో తూర్పారబట్టారు.
తెలంగాణ ప్రజల హక్కులను పణంగా పెట్టే హక్కు ఎవరిచ్చారంటూ ఘాటుగానే విమర్శించారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో సైతం తెలంగాణ ప్రజలకు చెందాల్సిన సింగరేణి నిధులను వైజాగ్‌కు తరలించడాన్ని తెలంగాణ రాజకీయ నాయకులు తప్పుపడుతున్నారు. బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టడం సమంజసం కాదని రాజకీయ నాయకులే కాక యూత్ సైతం దుమ్మెత్తి పోస్తున్నారు.
టెండర్‌లో పాల్గొనడమంటే ప్రైవేటీకరణను సమర్ధించడమే : ఏపీ మంత్రి అమర్‌నాథ్
వైజాగ్ స్టీల్‌కు సింగరేణి నిధులను ఖర్చు పెట్టడంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందిస్తూ.. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెండర్ ప్రక్రియలో సింగరేణి తరఫున బిడ్ వేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. నిజంగా ప్రైవేటీకరణను ఒక పార్టీగా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నట్లయితే దానికి తగిన కార్యాచరణ ఉండాలని తెలిపారు.
కానీ ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకుని సింగరేణి ద్వారా టెండర్ ప్రక్రియలో పాల్గొనడమంటేనే ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలకు మద్దతు పలికినట్లని పేర్కొన్నారు. నిజంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నట్లయితే ఏపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, టెండర్ ప్రక్రియ నుంచి తప్పుకోవాలని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నదని, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన భారీ సభలోనే సీఎం జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేశాని గుర్తుచేశారు.






