ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న జల వివాదలెన్నో తెలుసా?

by Muthe.Rajitha |

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు పరిష్కారం దొరికేది ఎన్నడూ?

ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న జల వివాదలెన్నో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీలో రేపు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇవ్వనున్నారు. అయితే ఇటీవల ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తెలంగాణకు వాటాగా రావాల్సిన నదీ జలాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం వలన ఆ నీటిని వాడుతోందని ఆరోపించింది. అంతేకాదు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ను ఎకాన్ద్రం వెనక్కి పంపించింది అంటూ సంచలన ఆరోపణ చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల నీటి వాటాల గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ క్లారిటీ ఇవ్వనున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నదీ జలాల వివాదాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి కంటే.. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరింత పెరిగాయి. ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రధానంగా కృష్ణా నది, గోదావరి నదిలపైనే వివాదం ఉంది. నీటి వాటా ఎంత, ఎవరు ఎంత నీరు వాడాలి, కొత్త ప్రాజెక్టులు చట్టబద్ధమా కాదా, అనధికారంగా నీటిని మళ్లిస్తున్నారా అనే విషయాలపైనే ప్రధానంగా గొడవలు జరుగుతున్నాయి. పెన్నా, వంశధార లాంటి నదులపై కూడా వివాదాలు ఉన్నప్పటికీ, అవి ఆంధ్రప్రదేశ్‌కు ఇతర రాష్ట్రాలతో ఉన్నవి. AP–TS మధ్య అసలు పెద్ద వివాదాలు మాత్రం కృష్ణా, గోదావరి నదులపైనే ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్స్, రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేసింది.

కృష్ణా నది జలాల వివాదం:

*కృష్ణా నది మొత్తం 1,400 కిలోమీటర్లు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. మొదట 1969లో ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ (KWDT-I) ప్రకారం కృష్ణా నదిలో అందుబాటులో ఉన్న నీరు 2,060 TMCగా లెక్కించారు. అందులో మహారాష్ట్రకు 560 TMC, కర్ణాటకకు 700 TMC, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 800 TMC కేటాయించారు.

*తర్వాత 2010లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (KWDT-II) మొత్తం నీటిని 2,578 TMCగా పెంచింది. అప్పట్లో మహారాష్ట్రకు 666 TMC, కర్ణాటకకు 907 TMC, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,005 TMC ఇచ్చారు.

*2014 రాష్ట్ర విభజన తర్వాత ఈ 1,005 TMCని జిల్లాల ఆధారంగా పంచారు. అందులో ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 512 TMC (66%), తెలంగాణకు సుమారు 299 TMC (34%) ఇచ్చారు. అయితే ఇక్కడే అసలు వివాదం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం తమకు 299 TMC చాలా తక్కువ అని అంటుండగా.. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇది ట్రిబ్యునల్ నిర్ణయం కాబట్టి మార్చలేమని చెబుతోంది.

*శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటిని ఎవరు ఎప్పుడు వాడాలి అనే విషయంలో కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయి. పట్టిసీమ, పులిచింతల వంటి ప్రాజెక్టుల ద్వారా ఏపీ నీటిని మళ్లిస్తోందని తెలంగాణ ఆరోపిస్తుండగా.. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ తెలంగాణ నీటిని వాడుతుందని ఏపి ఆరోపిస్తోంది. 2025లో కేంద్రం జోక్యంతో KRMB (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు), రియల్‌టైమ్ నీటి లెక్కల కోసం టెలిమెట్రీ సిస్టమ్ అమలుపై ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది.

గోదావరి నది జలాల వివాదం:

*ఇక గోదావరి నది మొత్తం 1,465 కిలోమీటర్లు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది. ఈ నదిలో మొత్తం నీరు సుమారు 3,200 TMCలుగా ఉంటుందని అంచనా. 1969లో ఏర్పాటైన గోదావరి ట్రిబ్యునల్ (GWDT) ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,480 TMC కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 960 TMC (65%), తెలంగాణకు సుమారు 520 TMC (35%) ఇచ్చారు.

*అయితే ఇక్కడ ప్రధాన వివాదం పోలవరం ప్రాజెక్టు. పోలవరం వల్ల తమ రాష్ట్రంలో ముంపు ప్రాంతాలు పెరుగుతాయని తెలంగాణ వాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇది జాతీయ ప్రాజెక్టు, కేంద్ర అనుమతులతోనే నిర్మిస్తున్నామని చెబుతోంది.

*అలాగే గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించే బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలపగా.. ఏపీ వెనక్కి తగ్గి ఆ ప్రాజెక్టు డీపీఆర్ లు క్యాన్సిల్ చేసింది. అయితే అదే ప్రాజెక్టును పేరు మార్చి నల్లమల సాగర్ గా కేంద్రానికి మరో కొత్త డీపీఆర్ పంపగా.. దానిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. ట్రిబ్యునల్ ప్రకారం 1,486 TMC మాత్రమే అనుమతి ఉందని, అంతకంటే ఎక్కువ నీటిని AP మళ్లిస్తోందని TS ఆరోపిస్తోంది. 2025లో కేంద్రం GRMB (గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) ఏర్పాటు, టెలిమెట్రీ అమలు పై నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలపై CWC కూడా పరిశీలన చేస్తోంది.

ఫలితం ఏమైందంటే..

మొత్తానికి AP–TS మధ్య నదీ జలాల వివాదం ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు. కృష్ణా నదిలో 299 TMC vs 512 TMC, గోదావరిలో 520 TMC vs 960 TMC అనే నంబర్లే ప్రధాన సమస్యగా ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, ఎన్నికల ప్రభావం వల్ల ఈ వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే 2025 నాటికి కేంద్ర ప్రభుత్వం బోర్డులు, కమిటీల ద్వారా సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. తుది నిర్ణయాలు వస్తేనే ఈ నదీ జలాల వివాదానికి పూర్తిస్థాయి పరిష్కారం దొరుకుతుంది నీటి పారుదలరంగ నిపుణులు భావిస్తున్నారు.

Next Story