ఆ మూడు బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయలేం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేస్తే అవి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆ మూడు బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయలేం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయలేమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. ఇవాళ ఆయన సచివాలయంలో వర్షాలు, సన్నద్ధతపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము కట్టిన బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయడం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారని, కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బెస్‌మెంట్లు పనికిరావంటూ ఇప్పటికే ఎన్‌‌డీఎస్‌ఏ (NDSA) రిపోర్టు ఇచ్చిందన్నారు. ఒకవేళ వాటిల్లో నీళ్లు స్టోర్ చేస్తే ఏకంగా బ్యారేజీలే కొట్టుకుపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఆ బ్యారేజీలు కూలితే భద్రాచలం సహా మొత్తం 44 గ్రామాలు కొట్టుకుపోతాయని పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ఒక్క నీటిపారుదల శాఖపైనే రూ.1.81 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. ఇంత చేస్తే కూలిపోయిన ప్రాజెక్టుగా కాళేశ్వరం మిగిలిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Next Story