- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు బోర్డులుగా జలమండలి..! GHMC తరహాలో విభజనకు సర్కార్ నిర్ణయం
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR)ను మూడు కార్పొరేషన్లుగా చేసినట్టుగానే జలమండలిని సైతం మూడు బోర్డులుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR)ను మూడు కార్పొరేషన్లుగా చేసినట్టుగానే జలమండలిని సైతం మూడు బోర్డులుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జీహెచ్ఎంసీలో విలీనం చేసినా 27 మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాను జలమండలినే చేస్తోంది. కానీ మురుగునీటి వ్యవస్థను మాత్రం జలమండలి స్వాధీనం చేసుకోలేదు. ఆ ప్రాంతాల్లో సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడమే అందుకు కారణం. దీంతోపాటు రూ.17,212 కోట్లతో సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జలమండలి ఇలా..
జలమండలి సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ వారీగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటిలో ఆపరేషన్, మెయింటెన్స్ (ఓఅండ్ఎం) సర్కిళ్లు 5 ఉన్నాయి. డివిజన్లు 22, సబ్ డివిజన్లు 68, సెక్షన్లు 192 ఉన్నాయి. వీటిని మున్సిపల్ కార్పొరేషన్ మాదిరిగానే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు ప్రస్తుతం జలమండలి స్వరూపం పూర్తిగా మారనుంది. మున్సిపల్ కార్పొరేషన్‌లోని జోన్‌ను జలమండలి సర్కిల్ గాను, సర్కిల్.. జలమండలి సబ్ డివిజన్, వార్డును సెక్షన్‌ను మార్చనున్నారు. దీంతో జలమండలి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ 12 సర్కిళ్లుగాను, 60 సబ్ డివిజన్లుగాను, 300 సెక్షన్లుగాను మారనుంది. డివిజన్ ఏరియాను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు చెబుతున్నారు.
మూడు భాగాలుగా..
గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాతోపాటు మురుగునీటి నిర్వహణ చేస్తున్న జలమండలిలో సైతం సంస్థాగత మార్పులు చేయనున్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలోని జీహెచ్ఎంసీ తరహాలోనే జలమండలి సేవలందించే విధంగా మార్పులు చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో జలమండలి, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీసీఎంసీ) పరిధిలో మరో జలమండలి, గ్రేటర్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంఎంసీ) పరిధిలో మరో జలమండలి ఉండే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే రెండు బోర్డులకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను నియమించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ మూడింటిని పర్యవేక్షించడానికి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మాస్టర్ ప్లాన్ ప్రకారం 2021లో మురుగు ఉత్పత్తి 1950 ఎంఎల్డీ కాగా, 2036 నాటికి 2800 ఎంఎల్డీలకు పెరుగుతుందని అధికారుల అంచనా.
సిబ్బంది.. ఆస్తులు
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేసిన నేపథ్యంలో ఉద్యోగులు, ఆస్తులను సైతం టేకోవర్ చేసుకున్నారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ వ్యవస్థను జలమండలి సైతం టేకోవర్ చేసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థను క్లీన్ చేసే సిబ్బందిని సైతం జలమండలికి కేటాయించాలని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే తాగునీటి సరఫరాకు సంబంధించిన ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఇతర బిల్డింగ్స్‌లను సైతం జలమండలికి అప్పగిస్తే బాగుంటుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సిబ్బందిలేకుండా 2053 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సేవలందించడం కష్టమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.






