- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. జలమండలి ఎమర్జెన్సీ ప్లాన్ రెడీ!
హైదరాబాద్ మహానగరంలో భవిష్యత్ తాగునీటి అవసరాలు, జలాశయాల్లో నీటి లభ్యత, ట్యాంకర్ నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, ఏంసీసీ ఫిర్యాదుల పరిష్కారం, సీవరేజ్ నిర్వహణ, పెండింగ్ పనులు, రెవెన్యూ వసూళ్లు తదితర అంశాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో భవిష్యత్ తాగునీటి అవసరాలు, జలాశయాల్లో నీటి లభ్యత, ట్యాంకర్ నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, ఏంసీసీ ఫిర్యాదుల పరిష్కారం, సీవరేజ్ నిర్వహణ, పెండింగ్ పనులు, రెవెన్యూ వసూళ్లు తదితర అంశాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో కంటింజెన్సీ ప్లాన్, ట్యాంకర్ బుకింగ్‌లు, డెలివరీలు, ఫిల్లింగ్ స్టేషన్ల సామర్థ్యం, ఇంకుడు గుంతల నిర్మాణం, పెండింగ్ పనులు, ఏంసీసీ ఫిర్యాదులు, రోడ్ల పునరుద్ధరణ పనులు, సింగిల్ విండో దరఖాస్తులు, కొత్త ప్రాంతాల నిర్వహణ, రెవెన్యూ వసూళ్లపై డైరెక్టర్లు, ఈడీలు, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలతో ఆయన విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సింగూర్.. మంజీరాకు..
సింగూర్.. మంజీరా జలాశయాలకు ఆశించిన స్థాయిలో వరద ప్రవాహాలు రాని పరిస్థితి ఏర్పడితే, ఆ వ్యవస్థపై ఆధారపడిన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని ఎండీ ఆదేశించారు. సింగూర్-మంజీరా నుంచి నీటి సరఫరా అవుతున్న ప్రాంతాలు, ఆయా ప్రాంతాల కనీస నీటి అవసరాలు, సరఫరా తగ్గితే ఏర్పడే లోటు, గోదావరి, కృష్ణా, మిషన్ భగీరథ తదితర వనరుల నుంచి ఎంత నీటిని మళ్లించవచ్చనే అంశాలను శాస్త్రీయంగా లెక్కించాలని సూచించారు. ప్రత్యామ్నాయ నీటి సరఫరాకు అవసరమైన ఇంటర్‌కనెక్షన్, పైప్‌లైన్లు, జంక్షన్లు, వాల్వులు, పంపింగ్ సదుపాయాలు, రిజర్వాయర్ ఇన్‌లెట్, ఔట్‌లెట్ మార్పులు, ప్రాంతాలవారీ నీటి కేటాయింపుతో కూడిన పూర్తి కంటింజెన్సీ ప్రణాళికను జూలై 16లోగా సమర్పించాలని స్పష్టం చేశారు. నీటి లభ్యత లేని పక్షంలో ప్రత్యామ్నాయాలను అన్వేషించడం కంటింజెన్సీ ప్రణాళిక కాదని, ఏ వనరులో నీరు తగ్గితే ఏ ప్రాంతం ప్రభావితమవుతుంది, ఎక్కడి నుంచి ఎంత నీటిని మళ్లించాలి, అందుకు అవసరమైన మౌలిక వసతులు ఏమిటన్నది ముందుగానే నిర్ణయించి పనులు ప్రారంభించాలని ఎండీ పేర్కొన్నారు.
జలాశయాలపై ధృవీకరించిన సమాచారం ఇవ్వాలి
అందుబాటులో జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీరు ఎన్ని రోజులకు సరిపోతుందనే అంశంపై ప్రస్తుత నిల్వలు, రోజువారీ డ్రాయల్, వినియోగించగల నీటి పరిమాణం, ఇతర కేటాయింపులు, నీటి నష్టాలను పరిగణనలోకి తీసుకుని అధికారిక వాటర్ బ్యాలెన్స్ సిద్ధం చేయాలని సూచించారు. ధృవీకరించని సమాచారంతో ప్రజల్లో అనవసర ఆందోళన కలిగించవద్దని, వాస్తవ పరిస్థితితో పాటు జలమండలి చేపడుతున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పారదర్శకంగా ప్రజలకు తెలియజేయాలని తెలిపారు.
మిషన్ భగీరథ అదనపు జలాలు
మిషన్ భగీరథకు సంబంధించిన పనులు పూర్తయిన తర్వాత జలమండలికి అదనంగా సుమారు 25 నుంచి 30 ఎంజీడీల నీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందున, ఆ నీటిని తూర్పు హైదరాబాద్, మల్కాజిగిరి తదితర ప్రాంతాలకు సమర్థవంతంగా వినియోగించేందుకు ఇప్పటి నుంచే అవసరమైన నెట్‌వర్క్‌ను సిద్ధం చేయాలని ఎండీ ఆదేశించారు. అదనపు నీరు వచ్చిన తర్వాత పనులు ప్రారంభించకుండా, ఏ ప్రాంతానికి ఎంత నీరు ఇవ్వాలి, ఏ రిజర్వాయర్‌కు అనుసంధానించాలి, ఎక్కడ పైప్‌లైన్లు, జంక్షన్లు, వాల్వులు, పంపింగ్ ఏర్పాట్లు అవసరమో ముందుగానే ఖరారు చేయాలని సూచించారు. అలాగే మిషన్ భగీరథ నీటి వినియోగం ద్వారా కృష్ణా లేదా గోదావరి వ్యవస్థల్లో ఆదా అయ్యే నీటిని సింగూర్- మంజీరా ప్రభావిత ప్రాంతాలకు మళ్లించే అవకాశాన్ని కూడా పరిశీలించాలన్నారు. గోదావరి వ్యవస్థ నుంచి అదనంగా సుమారు 10 ఎంజీడీల నీటిని తీసుకునే సాంకేతిక సాధ్యాసాధ్యాలపై ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు.
రోజుకు కనీసం 11 వేల ట్యాంకర్ ట్రిప్పులు
నగరంలో ట్యాంకర్ బుకింగ్‌ల పెండెన్సీని తగ్గించేందుకు రోజుకు కనీసం 11 వేల ట్యాంకర్ ట్రిప్పులు డెలివరీ చేయాలని ఎండీ ఆదేశించారు. రోజువారీగా నమోదయ్యే కొత్త బుకింగ్‌లను పూర్తి చేయడంతో పాటు పాత పెండెన్సీని కూడా అదనపు ట్రిప్పుల ద్వారా తగ్గించాలని సూచించారు. జలమండలి పరిధిలో మొత్తం 95 ఫిల్లింగ్ స్టేషన్ లు ఉండగా బోడుప్పల్, షాపూర్‌నగర్, ఎన్టీఆర్‌నగర్, కొత్తపేట, గాజులరామారం, పీర్జాదిగూడ, మంగాపురం తదితర ప్రాంతాలలో కొంత మేరకు పెండెన్సీ ఉందని ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు. ఈ పెండెన్సీ ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లు, డివిజన్లకు అదనపు ట్యాంకర్లు, డ్రైవర్లు, రాత్రి షిఫ్టులు, అదనపు ఫైలింగ్ పాయింట్లు, సమీప స్టేషన్ల నుంచి వాహనాల మ్యాపింగ్, అవసరమైన నీటి కేటాయింపులతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. ప్రధాన సమస్యాత్మక ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు రోజుల్లో బ్యాక్‌లాగ్ కనిపించకుండా చేయాలని, అనంతరం బుకింగ్‌లను నిర్ణీత సేవా ప్రమాణంలోపు డెలివరీ చేయాలని స్పష్టం చేశారు.
వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి
వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలకు బడ్జెట్ కేటాయించినప్పటికీ అనేక ప్రాంతాల్లో పనులు ప్రారంభం కాకపోవడం, పూర్తయిన పనుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంపై ఎండీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి రీజియన్, డివిజన్‌కు ఇచ్చిన లక్ష్యం, పూర్తయిన పనులు, పురోగతిలో ఉన్నవి, ప్రారంభం కానివి, నాన్‌ఫీజిబుల్‌గా గుర్తించినవి, ప్రత్యామ్నాయ స్థలాలు, బ్యాలెన్స్ పనులు స్పష్టంగా కనిపించే విధంగా డాష్‌బోర్డ్ రూపొందించాలని ఆదేశించారు. ఒక స్థలం అనుకూలంగా లేకపోతే లక్ష్యాన్ని వదిలేయకుండా మరో అనుకూల స్థలాన్ని గుర్తించి పని పూర్తి చేయాలని సూచించారు.
రూఫ్‌టాప్ నీటిని రీచార్జ్ నిర్మాణాలకు..
కేవలం ఇంకుడు గుంత నిర్మించడంతో పని పూర్తయినట్లు పరిగణించకూడదని, భవనం పై కప్పు నుంచి వచ్చే వర్షపు నీటిని ఫిల్టర్ చాంబర్ ద్వారా రీచార్జ్ పిట్, షాఫ్ట్ లేదా ఇంజక్షన్ బోర్‌కు అనుసంధానించాలని ఎండీ స్పష్టం చేశారు. పనిచేయని ప్రభుత్వ, పబ్లిక్ బోర్‌వెల్ లను గుర్తించి, సాంకేతికంగా అనుకూలమైన వాటిని రీఛార్జ్ బోర్లుగా మార్చాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, రిజర్వాయర్ ప్రాంగణాలు, ఇతర ప్రజా స్థలాల్లో కూడా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
అధిక ట్యాంకర్ బుకింగ్ అపార్ట్‌మెంట్లకు నోటీసులు
అధికంగా ట్యాంకర్లు బుక్ చేస్తున్న అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ నివాస సముదాయాలను గుర్తించి ఈ నెలలోనే నోటీసులు జారీ చేయాలని ఎండీ ఆదేశించారు. ప్రతి అపార్ట్‌మెంట్‌లో కొత్త రైన్‌వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణం, రూఫ్ వాటర్ అనుసంధానం, ఫిల్టర్ వ్యవస్థ ఉండేలా చూడాలని, నోటీసు అందుకున్న అపార్ట్‌మెంట్లు ఒక నెలలోపు పనులను ప్రారంభించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. ప్రస్తుత వర్షాకాలంలో చేపట్టే చర్యల వల్ల వచ్చే ఏడాది భూగర్భ జలమట్టాలు పెరిగి ట్యాంకర్ డిమాండ్ తగ్గుతుందని పేర్కొన్నారు.






