సర్పంచ్ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం.. రాష్ట్రంలో రూ.11వేల కోట్లు దాటిన ఖర్చు!

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని గ్రామాలకు కలుపుకుని సర్పంచ్ ఎన్నికల కోసం అభ్యర్థులు చేసిన ఖర్చు రూ.11వేల కోట్లు దాటి ఉంటుందని చర్చ జరుగుతున్నది.

సర్పంచ్ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం.. రాష్ట్రంలో రూ.11వేల కోట్లు దాటిన ఖర్చు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గ్రామాలకు కలుపుకుని సర్పంచ్ ఎన్నికల కోసం అభ్యర్థులు చేసిన ఖర్చు రూ.11వేల కోట్లు దాటి ఉంటుందని చర్చ జరుగుతున్నది. గెలవాలనే లక్ష్యంతో మెజార్టీ గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చుచేశారు. గెలిచిన అభ్యర్థి రూ.50లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు ఖర్చు చేయగా, ఓడిన అభ్యర్థి సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చు చేశారు. బరిలో ఉన్న మిగతా అభ్యర్థుల వ్యయం సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుంది. అదనంగా వార్డు సభ్యులు తమ శక్తి మేర ఖర్చుచేశారు. దీనితో సగటున ఒక్కో గ్రామంలో సర్పంచ్ ఎన్నికల పేరుతో రూ.కోటి మేర ఖర్చుచేశారు.

‘పంచాయతీ’ చరిత్రలో రికార్డు

రాష్ట్రంలోని 12,728 గ్రామాలకు మూడు దఫాలుగా ఎన్నికలు జరిగాయి. ఇందులో సమారు 1200 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 11,528 గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్లు జరిగాయి. ఈ గ్రామాల్లో ఎన్నికల కోసం అందరు అభ్యర్థులు చేసిన ఖర్చు సగటున రూ.కోటివరకు ఉంటుందని, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఖర్చు రూ.11వేల కోట్లు దాటి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నిజానికి గతంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం చాలా తక్కువ. కుల సంఘాల సమావేశాలు నిర్వహించి, వారికి కావాల్సిన సాముహిక అవసరాలు తీర్చేవారు. గ్రామంలోని యువతకు క్రికెట్ కిట్స్, ఇతర ఆట సామగ్రిని గిఫ్ట్ గా ఇచ్చేవారు. మరీ తప్పదనుకుంటే రాత్రి పూట దావత్ లు ఇచ్చేవారు. కానీ ఈసారి ఓటర్లకు డబ్బులు సైతం పంచారు.

భూములు, బంగారం అమ్మి

ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు ధనవంతులు కాదు. నాలుగైదు ఎకరాలు ఉన్న రైతులే ఎక్కవ మంది పోటీచేశారు. ఓడిపోతే పరువు పోతుందనే తపనతో అభ్యర్థులు ఖర్చుకు వెనగడుగు వేయలేదు. అందుకోసం మెజార్టీ గ్రామాల్లోని అభ్యర్థులు తమ భూములు, బంగారం అమ్ముకున్నారు. కొందరు కుదువబెట్టి వచ్చిన డబ్బుతో ఎన్నికల ప్రచారానికి ఖర్చుచేశారు. ఆవిధంగా వచ్చిన డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పడి ఖర్చుచేశారు. మెజార్టీ గ్రామాల్లో ఓటుకు రూ.1000 పంపిణీ చేయగా కొన్ని గ్రామాల్లో రూ.రెండువేలు, రూ.మూడు వేల మేర పంపిణీ చేశారు. పోటీ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ఏకంగా రూ.ఐదువేలు ఇచ్చారు. పోలింగ్ కు ముందు రోజు ఇంటికి కిలో చెప్పున చికెన్ పంపిణీ, మహిళ ఓటర్లకు చీరలు, గిన్నెలు, ఉంగరాలు, ఇతర వస్తువులను పంచిపెట్టారు. పురుషులకు లిక్కర్ బాటిల్స్ పంపిణీ చేశారు. వీటికి తోడు అదనంగా ఎన్నికల ప్రచారం చేసిన కార్యకర్తలకు రాత్రిపూట మందు పంపిణీ చేయడం పరిపాటిగా మారింది.

Next Story