కలెక్టరేట్ భవనం ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం

by Jakkula.Mamatha |

తన భూమిని అక్రమంగా ఇతరులకు పట్టా చేశారని ఆరోపిస్తూ పురుగుల మందు డబ్బాతో కలెక్టర్ కార్యాలయం పైకి ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో చోటుచేసుకుంది.

కలెక్టరేట్ భవనం ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: తన భూమిని అక్రమంగా ఇతరులకు పట్టా చేశారని ఆరోపిస్తూ పురుగుల మందు డబ్బాతో కలెక్టర్ కార్యాలయం పైకి ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో చోటుచేసుకుంది. ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన బాధితుడు పయ్యావుల సాంబరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1146/ఏ లో 4.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇదే సర్వే నెంబర్‌లో ధర్మసాగర్‌కు చెందిన అప్పాల సాయిలు, గట్టయ్య, మహేందర్, రవి, రాములుకు సుమారు 3.01 ఎకరాల భూమి ఉంది. కాగా, ధర్మసాగర్ రిజర్వాయర్ ముంపు కింద అప్పాల వారి కుటుంబ సభ్యులకు చెందిన 2.38 ఎకరాల భూమి ముంపు కింద పోయి ప్రభుత్వంతో నష్టపరిహారం తీసుకున్నారు. పయ్యావుల మల్లయ్యకు 4.10 ఎకరాల భూమి ఉండగా 4 ఎకరాలు మాత్రమే పట్టా అయ్యింది. మిగతా 10 గుంటల భూమి పట్టా కావాలని తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.

ఈ క్రమంలో అప్పాల మహేందర్ అతని కుటుంబ సభ్యులు తహసీల్దార్‌తో చేతులు కలిపి గ్రామ పెద్దమనుషులు, మాజీ సర్పంచ్‌తో కలిసి ముంపు కింద పోయిన భూమిని తిరిగి పట్టా చేసుకున్నారు. పట్టా చేసుకుని పయ్యావుల మల్లయ్య ఖాస్తులో ఉన్నా భూమిలోకి వచ్చి ఈ భూమి తనదేనని గొడవకు దిగుతున్నారు. ఈ క్రమంలో పయ్యావుల మల్లయ్య కుమారుడు పయ్యావుల సాంబరాజు ధర్మసాగర్ తహశీల్దార్ కార్యాలయంలో తమ భూమిని వేరే వారికి పట్టా చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ధర్మసాగర్ తహశీల్దార్ ఫీల్డ్ సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. తదనంతరం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన సర్వే రిపోర్ట్ ఇవ్వకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ సమస్య పై బాధితులు పలు సార్లు కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదు. దీంతో విసుగు చెందిన బాధితులు పయ్యావుల మల్లయ్య కుమారుడు సాంబరాజు సోమవారం పురుగుల మందు డబ్బాతో జిల్లా కలెక్టర్ కార్యాలయం పైకి ఎక్కి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.

దీనిపై ధర్మసాగర్ తహశీల్దార్ సదానందంను వివరణ కోరగా.. రికార్డుల పరంగా ఇద్దరికి ఉండాల్సిన భూమిని ఇరువురికి పట్టా చేయడం జరిగిందని తెలిపారు. మొఖా మీద వారి ఇరువురు కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నాయని దీనిని సివిల్ కోర్టులో చూసుకోవాలని సూచించినట్లు చెప్పారు. పయ్యావుల సాంబరాజు చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తామని అన్నారు. పయ్యావుల సాంబరాజు కు రికార్డు పరంగా 10 గుంటల భూమిని కూడా నమోదు చేశామని మొఖా మీద సమస్య ఉంటే వారి ఇరువురు చూసుకోవాలని రికార్డు పరంగానే ఇద్దరికి పట్టా చేసినట్లు తహశీల్దార్ సదానందం పేర్కొన్నారు. ఏదైనా ఉంటే సివిల్ కోర్టులో చూసుకోవాలి. మాపై అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు.

సీఐ శ్రీధర్ వివరణ కోరగా.. సివిల్ విషయాలు తగాదాలు మేము పట్టించుకోమని నేను చెప్పానని ఈ భూముల విషయాలు, తగాదాలు తహసీల్దార్ కార్యాలయం లేదా కోర్టులో చూసుకోవాలని నేను చెప్పాను. కానీ ఏ రోజు ఈ కేసులో నేను ఏమి చెప్పలేదని ఈ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

Next Story