మ‌క్క‌ల‌ను బ‌రాబ‌ర్ కొనాల్సిందే..!

by Ratna Kumari |

నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు.

మ‌క్క‌ల‌ను బ‌రాబ‌ర్ కొనాల్సిందే..!
X

దిశ, నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. కేంద్రంలో ఉన్న రైతుల సమస్యలు అడిగి తెలుసు కున్నారు. రోజులుగా మార్కెట్ లో ఉంటున్న మహిళా రైతుల సమస్యలపై ఆరా తీశారు. పర్సనాయక్ తండా కు చెందిన మహిళ చెప్పిన మాటలు విని ఆశ్చర్యానికి గురయ్యారు. మక్కలు మార్కెట్ తీసుకురావడం మొదలు ప్రతీ పైసా తమ నుంచే వసూలు చేస్తున్నట్టు బాధిత మహిళ చెప్పుకొచ్చింది. బస్తాలు, సుతీలు, ట్రాన్స్ పోర్టుతో సహా, వెయిటింగ్ ఛార్జ్ తో సహ అన్నీ చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కేటీఆర్ బరాబర్ ప్రభుత్వం మక్కలను కొనాల్సిందేన‌ని.. కొనేంతవరకు వదిలేది లేదన్నారు. రైతుల పక్షాన పోరు సాగిస్తామని అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు.


నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లో కనీస సౌకర్యాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. అధికారుల మధ్య సమన్వయం కొరవడిందన్నారు. వ్యవసాయ మార్కెట్ లో దాదాపు 600 వరకు టోకెన్స్ ఇస్తే ఇప్పటికీ కనీసం 200 దాటకపోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బస్తాలు ఇవ్వరు.. కనీసం త్వరగా అమ్ముకుందామని మార్కెట్ వస్తే వెయిటింగ్ పేరుతో ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీద పడటమే కాకుండా రోజుల తరబడి మార్కెట్ లోనే ఉండాల్సిన దౌర్భాగ్యం ఎదురవుతోందన్నారు. నల్లబెల్లి మండలంలోని గుండ్లపహాడ్ గో డౌన్ దగ్గర వాహనాలు రోజుల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కున్నాయన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో గో డౌన్ లో కేవలం 25వేల బస్తాలు పట్టే స్థలం ప్రస్తుతం ఉందని.. కానీ ట్రాఫిక్ లో మూడు రెట్లు రెట్టింపు బస్తాలతో వాహనాలు బారులు తీరినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు గో డౌన్ నిర్వాహకులకు, ప్రభుత్వానికి సమన్వయం ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు. రైతులను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.

Next Story