గుడ్ న్యూస్‌...వ్యాపారవేత్తలుగా మహిళలు

by velandi.Saikiran |

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతోంది.

గుడ్ న్యూస్‌...వ్యాపారవేత్తలుగా మహిళలు
X

గుడ్ న్యూస్‌...వ్యాపారవేత్తలుగా మహిళలు

=మహిళాసాధికరతపై సర్కారు ఫోకస్​

=మేడారం జాతరలో వ్యాపారాలతో ఆర్థిక పరిపుష్టి

=గోదావరి పుష్కరాల్లో స్టాళ్ల ఏర్పాటుకు చర్యలు

= ప్రణాళికలు సిద్ధం చేస్తున్న మంత్రి సీతక్క

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతోంది. మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. మహిళలు అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక చేపట్టింది. ప్రత్యేక శిక్షణ ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా మారుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ములుగు జిల్లాలోని మహిళలు ఆర్థికంగా ఎంతో బలోపేతమవుతున్నారు.

ఇటీవల ముగిసిన మేడారం మహా జాతర సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం నుంచి మేడారం గ్రామం వరకు దాదాపు 120 కిలోమీటర్ల జాతీయ రహదారిపై వ్యాపారాలను ఏర్పాటు చేయడమే కాకుండా జాతర పరిసర ప్రాంతాల్లో పలు రకాల వ్యాపారాలు నిర్వహించారు. గవర్నర్ దత్తత గ్రామమైన తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో పలు రకాల మసాలాలు తయారు చేస్తూ ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. మంత్రి సీతక్క వచ్చేయేడాది జనవరి 26 నుంచి జులై 7వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా మహిళల వ్యాపారాలు విస్తృతం చేయాలన్న ఉద్దేశంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట మండలాల సమీపంలోని గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో 22 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తుండగా అన్నిచోట్ల దుకాణాలు నెలకొల్పాలని నిర్ణయానికి వచ్చారు. 2015లో జరిగిన పుష్కరాలకు 20 లక్షల మంది పైగా భక్తులు హాజరు కాగా ఈసారి కోటి మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం అంచనావేస్తోంది.

మూడు రోజులు.. మూడు కోట్ల ఆదాయం..

మేడారం మహా జాతర సందర్భంగా కేవలం మూడు రోజుల్లోనే మహిళలు రూ.3 కోట్లకు పైగా నికర లాభాన్ని గడించారు. మంత్రి సీతక్క తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ దివాకర టీఎస్. మహిళలను ప్రోత్సహించారు.

మహిళల విజయగాథలు..

1. బాంబూ చికెన్ (జంపన్న వాగు): రెడ్డిగూడెం గ్రామానికి చెందిన కడారి సంధ్య బ్యాంకు నుంచి రూ. 0.75 లక్షల రుణం తీసుకుని వ్యాపారం ప్రారంభించి ఏకంగా రూ. 1.25 లక్షల నికర లాభాన్ని పొందింది.

2.ఇప్పపువ్వు (మోహ్వా) లడ్డు: కొండపర్తి గ్రామానికి చెందిన సమ్మక్క సారక్క ఉత్పత్తిదారుల సంఘం, గ్రామ సంఘం నుంచి రూ.లక్ష పెట్టుబడితో రూ. 4.05 లక్షల భారీ లాభాన్ని సాధించి రికార్డు సృష్టించింది.

3 . ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ (మల్లంపల్లి): గాయత్రి ఎస్​హెచ్​జీ సభ్యురాలు ఎంబూరి అవంతి, రూ.2 లక్షల పెట్టుబడితో రూ. 1.50 లక్షల నికర లాభాన్ని గడించారు.

4. ఫిష్ అవుట్‌లెట్ (జంగలపల్లి): ఇంచెర్ల గ్రామానికి చెందిన బయ్య మల్లమ్మ (హిమబిందు ఎస్​హెచ్​జీ) రూ.లక్ష పెట్టుబడితో రూ.1.20 లక్షల లాభాన్ని పొందారు.

5. టీ షాప్, కూల్ డ్రింక్స్ (ఎర్రిగట్టమ్మ): ఇంచెర్లకు చెందిన బి. తిరుపతమ్మ రూ. 2లక్షల పెట్టుబడితో రూ.1.50 లక్షల లాభాన్ని సాధించారు.

6. బెల్లం దుకాణం (మేడారం): మేడారం గ్రామానికి చెందిన ఆలం ప్రశాంతి ( సమ్మక్క ఎస్​హెచ్​జీ ) రూ.3.75 లక్షల పెట్టుబడితో రూ.2.06 లక్షల లాభాన్ని సాధించారు.

7. కూల్ డ్రింక్స్, జనరల్ స్టోర్ ( నార్లపూర్ - ఊరట్టం రోడ్ ) నార్లపూర్ గ్రామానికి చెందిన జ్యోతి ( వేంకటేశ్వర ఎస్​హెచ్​జీ ) రూ.1.25 లక్షల పెట్టుబడితో 1.10 లక్షల లాభాన్ని సాధించారు.

8. కిరాణం , వాటర్ ప్లాంట్ : కొత్తూరు గ్రామానికి చెందిన పోలేబోయిన శృతి ( వరలక్ష్మి ఎస్​హెచ్​జీ ) రూ.1.50 లక్షల పెట్టుబడితో 1.40 లక్షల లాభాన్ని పొందారు.

ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి పేరుతో క్యాంటీన్‌లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల కొనుగోలు వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం అందిస్తున్న చేయూత మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న 'ఇందిరా మహిళా శక్తి' పథకం అండతో వారు కేవలం తమ కుటుంబాలకే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

Next Story