రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అడవి పందులు

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-03-13 07:37:06  IST  )

హన్మకొండ జిల్లా, శాయంపేట మండలంలోని రైతులకు అడవి పందులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అడవి పందులు
X

దిశ, శాయంపేట : హన్మకొండ జిల్లా, శాయంపేట మండలంలోని రైతులకు అడవి పందులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా పత్తిపాక గ్రామంలో వీటి బీభత్సం రోజురోజుకు పెరుగుతోంది. గ్రామానికి చెందిన రైతు రావుల ఇంద్రసేనారెడ్డి సాగు చేసిన రెండు ఎకరాల మొక్కజొన్న పంటను అడవి పందులు పూర్తిగా నేలమట్టం చేశాయి. రాత్రి వేళల్లో గుంపులుగా పొలాల్లోకి దూసుకొస్తున్న అడవి పందులు పంటను పీకి, తొక్కి పాడుచేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంట కోతకు దగ్గరలో ఉండగా ఇలా నాశనం కావడం వల్ల రైతులకు భారీగా నష్టం వాటిల్లిందని వాపోతున్నారు.

వరుస ఘటనలతో గ్రామంలోని ఇతర రైతులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అడవి పందులు తరచూ పొలాల్లోకి రావడంతో తమ పంటలకూ ఇదే పరిస్థితి వస్తుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకోవడానికి రాత్రంతా పొలాల్లో కాపలా కాస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అడవి పందుల సమస్యను అరికట్టేందుకు సంబంధిత అటవీ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అలాగే నష్టపోయిన రైతుకు ప్రభుత్వం తక్షణమే పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story