చెరువులపై అక్రమ నిర్మాణాలు.. వరంగల్‌‌కు ముంపు భయం

by Naga Rani Yarlagadda |

వరంగల్‌ మహానగరం.. కాకతీయ సామ్రాజ్యానికి రాజధాని. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అన్నీ కల్పించారు.

చెరువులపై అక్రమ నిర్మాణాలు.. వరంగల్‌‌కు ముంపు భయం
X

దిశ, వరంగల్‌ టౌన్ : వరంగల్‌ మహానగరం.. కాకతీయ సామ్రాజ్యానికి రాజధాని. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అన్నీ కల్పించారు. చెరువులు తవ్వించారు. గుళ్లు కట్టించారు. అప్పటి కాలానికి తగినట్టు బాటలు వేసుకున్నారు. అప్పటికాలంలో మురుగు నీటి కాల్వలు లేకపోయినా కాలక్రమేణా పాలకులు, ప్రభుత్వాలు మురుగుకాల్వలు కట్టించారు. రహదారులను విస్తరించారు. మౌలిక వసతులను మరింత మెరుగుపరిచారు. కానీ, చెరువులను రక్షించడం మరిచిపోయారు. కాదు.. నిర్లక్ష్యం వహించారు. అదే క్రమంలో అవినీతికి అలవాటుపడి అక్రమాలకు తెరదీశారు. ఇంకేముంది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చెరువులు, కుంటలు, మురుగునీటి కాల్వలు అనే తేడా లేకుండా నిర్మాణాలు కూడా పెరిగాయి. వీటన్నింటికీ అధికారులే కళ్లుమూసుకునో, కాసులకు కక్కుర్తిపడో అనుమతులు ఇచ్చేశారు. ఇంకేముంది నీరు ఉండే స్థలంలో ఇళ్లు ఉండడంతో ఆ నీరు కాస్త ఇతర ఖాళీ ప్రదేశాలకు పరుగులు తీస్తోంది. దాన్నే ఇప్పుడు ముంపు అని ముద్దుగా పిలుచుకుంటున్నాం. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఇండ్లు నీట మునుగుతున్నాయి, వీధులు జలమయమవుతున్నాయని గొంతు చించుకుంటే వచ్చే వానలు ఆగుతాయా? పరుగు తీసే వరద నిలిచిపోతుందా?

చెరువులో కట్టుకోవడం ఎవరి తప్పు?

చిల్లు పడ్డ పడవలో ఎవరైనా ప్రయాణిస్తారా? అలాగే చెరువు స్థలం వానపడితే నీరు వచ్చి చేరుతుందని తెలిసీ అగ్గువకు వస్తున్నదనో, ఆస్తులు కూడబెట్టుకుందామనో కొందరు పరిస్థితులు అర్థం చేసుకుండానే స్థలాలు కొనుగోలు చేశారు. స్థలం కొనుగోలు చేసిన రోజుల్లోనే ఎన్నోసార్లు అవి నీట మునిగే ఉంటాయి. అప్పటికైనా మేల్కోకుండా గొర్రెలమందలా స్థలాలు కొనుగోలు చేయడం స్వీయతప్పిదమే అవుతుంది. పది రూపాయల పండు కొనడానికే ఒకటికి రెండు సార్లు పరిశీలించే జనం, రూ.లక్షలు పోసి కొనే స్థలం గురించి తెలవకుండానే కొనుగోలు చేశారంటే నమ్మశక్యం అనిపించుకోదు. ఇదే విషయాన్ని గతేడాది వర్షాకాలంలో ముంపు ప్రాంతాల సందర్శనలో అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొనడం గమనార్హం. ‘చెరువుల్లో ఇళ్లు కట్టుకుంటే మునగకపోతే ఏమైతందంటూ’ బాహాటంగానే వ్యాఖ్యలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

అధికారుల అతిపెద్ద తప్పు!

ప్రభుత్వ స్థలాలను, చెరువులను, వాటి శిఖం భూములను పరిరక్షించాల్సిన అధికారులు ఇప్పటికీ మొద్దునిద్రలోనే ఉన్నారు. ఏ ఒక్క చెరువుకు కూడా సరైన హద్దులు నిర్ధారించకపోవడమే ఇందుకు నిదర్శనం. వరంగల్‌ మహానగరంలో ప్రధానంగా కాజీపేట ఏరియాలో కొన్ని ప్రాంతాలు, హన్మకొండలో ఫారెస్ట్‌ ఆఫీసు ఏరియా, ములుగు రోడ్డు అలంకార్ సెంటర్, పెద్దమ్మ గడ్డ, కాకతీయ కాలనీ, కాపువాడ, స్మార్ట్ సిటీ కాలనీ, వరంగల్‌లో భద్రకాళి చెరువు పరిసర ప్రాంతాలు, సంతోష్ మాత టెంపుల్, పోతన నగర్, రామన్నపేట, బీటీ బజార్, పెరుకవాడ, శివానగర్, బీసీ కాలనీ, ప్రియదర్శిని కాలనీ కాశిబుగ్గలో గణేష్ నగర్, ఎస్సార్ నగర్, పద్మనగర్, బృందావన్ కాలనీ, ఎన్ టీ ఆర్ నగర్, సాయినగర్, గాయత్రి కాలనీ, వివేకానంద కాలనీ 2 తో పాటు మరికొన్ని కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఒక్క వానాకాలంలోనే కాదు, ఒక గంటసేపు వాన గట్టిగ పడితే ఈ ప్రాంతాలు జలమయమయినట్లే. ఈ మునిగే ప్రాంతాలన్నీ చెరువు శిఖం భూములేనని అందరికీ తెలిసిందే. మరి అలాంటి ప్రదేశాల్లో ఇళ్ల నిర్మాణానికి అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు అనే ప్రశ్నకు సమాధానం అవినీతి అని చెప్పొచ్చు. ఇదే విషయమై అధికారులను నిలదీస్తే ‘మేమేం చేయాలి.. ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తేనే ఇచ్చాం’ అనే సమాధానం వెనుక అసలు దొంగలెవరో స్పష్టమవుతోంది. ఆయా ప్రాంతాలు ఏటా నీట మునుగుతున్నాయని తెలిసినా ఇప్పటికీ పలువురు ఇళ్లు కడుతూనే ఉన్నారు. అధికారులు పర్మిషన్లు ఇస్తూనే ఉన్నారు. అంటే తప్పు చేసేదే అధికారులు. మళ్లీ ఏటా సమీక్షలు, ముంపు నివారణ చర్యలంటూ కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నామని అటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పడుతున్న తిప్పలు.

మూడు నెలలు ఎక్కడన్న ఉంటే..!

తెలిసో, తెలియకో చెరువుల స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నారు. ఏటా వర్షకాలంలో నీట మునుగుతాయని తెలుసు. అయినా అందులో ఉండి తీరా మునిగాక కాపాడమని చేతులు పైకెత్తే బదులు మూడు నెలలు వానకాలం ప్రారంభానికి ముందే మరోచోటికి వెళ్తే సరిపోతుంది. చేసిన తప్పుకు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం ఒత్తిడి తీసుకొచ్చిన వారే అధికారులు పట్టించుకోవడం లేదు. నాయకులు తమ సమస్యను పరిష్కరించడం లేదని గగ్గోలు పెట్టడం మాని ముంపు బాధను అనుభవించేందుకు ఏటా సంసిద్ధంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. లేదంటే ఆ స్థలాలను ప్రభుత్వానికి అప్పగించి స్వచ్ఛందంగా వదిలేసి వెళ్లడం మరీ మంచిది. అయినా, ఏటా ముంపు సమయంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం వివిధ సేవలు అందిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, పలువురు ప్రజాప్రతినిధులు, కొందరు దయామయులు ఆహారం, మంచినీరు, దుప్పట్లు, దుస్తులు అందిస్తూనే ఉన్నారు.

Next Story