మార్కెట్‌ రోడ్డు మాయా‘జలం’.! కాశిబుగ్గ` ఏనుమాముల మార్గంలో రోడ్డు అధ్వానం

by Bhanu |

ఏనుమాముల చుట్టు పది జిల్లాలకు పెద్ద మార్కెట్‌. కానీ, దానికి వెళ్లే మార్గం మాత్రం అధ్వానం. మార్కెట్‌ ఏర్పడిన నాటి నుంచి గట్టిగ రోడ్డు పోసిన దాఖలాలు లేవు. పైపై పూతలు వేసి చేతులు దులుపుకుంటున్నారు.

మార్కెట్‌ రోడ్డు మాయా‘జలం’.! కాశిబుగ్గ` ఏనుమాముల మార్గంలో రోడ్డు అధ్వానం
X

దిశ, వరంగల్‌ టౌన్ : ఏనుమాముల చుట్టు పది జిల్లాలకు పెద్ద మార్కెట్‌. కానీ, దానికి వెళ్లే మార్గం మాత్రం అధ్వానం. మార్కెట్‌ ఏర్పడిన నాటి నుంచి గట్టిగ రోడ్డు పోసిన దాఖలాలు లేవు. పైపై పూతలు వేసి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా నాలుగు రోజులకే రోడ్లు దెబ్బతిని నరకం చూపిస్తున్నాయి. వరంగల్‌ కాశిబుగ్గ నుంచి ఏనుమాములకు వెళ్లే రహదారి పలు చోట్ల దెబ్బతిని అధ్వానంగా తయారైంది. వ్యవసాయ మార్కెట్‌ కావడంతో భారీ వాహనాలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ క్రమంలో రోడ్డు పటిష్టంగా వేయాల్సి ఉంటుంది. కానీ, కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా తారు వేసి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా కొద్ది రోజులకే రోడ్డు దెబ్బతింటోంది. దాదాపు ఐదారు ఏండ్లుగా ఈ రోడ్డును పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో రోడ్డంతా కంకర తేలి మరీ దారుణంగా మారింది. కాశీబుగ్గ నుంచి మార్కెట్‌ వైపుకు వెళ్లే మార్గంలో లక్ష్మి గణపతి కాలనీ వద్ద రోడ్డు కల్వర్టు ఎత్తుపల్లాలుగా ఉండడం వల్ల పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. వర్షం పడితే ఈ కల్వర్టు ఒకవైపు నీరు నిలిచి బురదమయంగా తయారవుతోంది.


ద్విచక్రవాహనాలు ఆ బురదలో నుంచి వెళ్లలేక రోడ్డు కింది భాగం నుంచి వెళ్లే క్రమంలో వాహనాలు స్కిడ్‌ అయి గాయాల పాలవుతున్నారు. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న తుప్పురు వానకే ఇక్కడ నీరు నిలిచి.. ఇప్పటికే నలుగురైదుగురు ఈ ప్రాంతంలో కిందపడ్డారు. అటు మున్సిపాలిటీ అధికారులు, ఇటు ఆర్‌అండ్‌ బీ అధికారులు ఎవరూ ఈ మార్గాన్ని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా స్పందించి, ఈ గుంతను పూడ్చివేస్తారా? లేదా? అనేది వేచిచూడాల్సిందే.

Next Story