ఎనుమాముల మార్కెట్ లో రికార్డు ధర

by velandi.Saikiran |

సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడులు పడిపోవడంతో మిర్చీకి డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో వరంగల్ లోని ఎనుమాముల మార్కెట్ లో బుధవారం వండర్ హాట్ రకానికి చెందిన మిర్చీకి రికార్డు ధర పలికింది.

ఎనుమాముల మార్కెట్ లో రికార్డు ధర
X

దిశ, వరంగల్ బ్యూరో: సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడులు పడిపోవడంతో మిర్చీకి డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో వరంగల్ లోని ఎనుమాముల మార్కెట్ లో బుధవారం వండర్ హాట్ రకానికి చెందిన మిర్చీకి రికార్డు ధర పలికింది. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం నీలంపల్లికి చెందిన రైతు వినోద్ ‘వండర్ హాట్’ మిర్చీ తీసుకురాగా.. రూ.37,100 ధర వచ్చింది. ఇది ఈ సీజన్ లోనే ఇదే అత్యధిక ధర. కాగా, ఈ వండర్ హాట్ రకం మిర్చీకి గతేడాది రూ. 30 వేల లోపే ధర రావడం గమనార్హం. వరంగల్, ఖమ్మంతోపాటు ఇతర మార్కెట్లలో నెల రోజులుగా మిర్చీ కొనుగోళ్లు సాగుతున్నాయి.

తగ్గిన దిగుబడులతో..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సారి 1.50 లక్షల ఎకరాల్లో మిర్చీని సాగు చేశారు. అయితే మిర్చీ నాటే సమయానికి కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతిన్నది. ఉన్న పంటలోనూ అనుకున్న స్థాయిలో దిగుబడి రాకపోవడంతో మార్కెట్ కు మిర్చీ రావడం తగ్గింది. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది సాగువిస్తీర్ణం తగ్గింది. గృహ అవసరాలకు వినియోగం పెరగడం, మార్కెట్ కు మేలు రకమైన మిర్చీ వస్తుండడంతో వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. దీంతో అన్ని రకాల మిర్చీకి భారీగా ధర పలుకుతున్నది. ఉమ్మడి వరంగల్ తోపాటు ఇతర జిల్లాలకు చెందిన వారు సైతం ఎనుమాముల మార్కెట్ కు మిర్చీని తీసుకువచ్చి అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో ప్రతి రోజు రెండు నుంచి నాలుగు వేళ్ల క్వింటాళ్ల మధ్య కొనుగోళ్లు జరుగుతున్నాయి. కాగా, ఈ సీజన్ లో ఇప్పటి వరకు 85వేల క్వింటాళ్ల మిర్చీ కొనుగోలు చేసినట్లు కార్యదర్శి మల్లేశం తెలిపారు. మార్కెట్ లో రైతుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

ఈ సీజన్ లో వివిధ రకాల మిర్చీకి క్వింటాలుకు వచ్చిన ధరలు

వండర్ హాట్: రూ. 15 వేల నుంచి రూ. 37 వేల వరకు..

తేజా: రూ. 12వేల నుంచి రూ. 19 వేల వరకు

యూఎస్ 341: రూ. 12 వేల నుంచి రూ. 26 వేల వరకు

దీపిక: రూ. 30వేల వరకు..

ఎల్లో మిర్చీ: రూ. 35 వేల నుంచి రూ. 37 వేల వరకు

దేశీ రకం: రూ. 20 వేల నుంచి రూ. 41 వేల వరకు

ధర వస్తున్నా.. దిగుబడి తగ్గింది

-వినోద్, రైతు, నీలంపల్లి

నేను రెండెకరాల్లో మిర్చీ సాగు చేశాను. బుధవారం ఎనిమిది బస్తాల మిర్చీని మార్కెట్ కు తీసుకువచ్చాను. రూ. 37,100 ధర వచ్చింది. అయితే ఈ ఏడాది ధర వస్తున్నా.. దిగుబడి చాలా తగ్గింది.

Next Story