- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివాలయంగుట్ట పక్కన క్షుద్రపూజల కలకలం!
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో అమావాస్య వేళ జరిగిన ఒక ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది

దిశ, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో అమావాస్య వేళ జరిగిన ఒక ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇక్కడి ప్రసిద్ధ పర్వతాల శివాలయం పురాతన ఆనవాళ్ళు కాకతీయుల చరిత్ర కలిగిన పర్వతగిరి రిజర్వాయర్ గుట్ట పక్కన గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల వేటలో భాగంగా క్షుద్రపూజలు నిర్వహించినట్లుగా అనుమానిస్తున్న ఘటన వెలుగుచూసింది. ఈ వ్యవహారంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
చేపల వేటకు వెళ్లిన యువకులతో కలకలం..
స్థానికులు మరియు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. అమావాస్య వేళ రిజర్వాయర్‌లో గాలం వేసి చేపలు పట్టేందుకు కొందరు స్థానిక యువకులు గుట్ట పరిసర ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో రిజర్వాయర్ పక్కన నిర్జన ప్రదేశంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించారు. యువకులు వారి వైపుగా నడుచుకుంటూ వెళ్తుండటం చూసిన ఆ గుర్తుతెలియని వ్యక్తులు వారిని బెదిరించడంతో పాటు కంగారుపడి పరుగులు తీసి.. వారు తీసుకువచ్చిన కారులో పరారు అయ్యారు.
ఘటనా స్థలంలో భీతావహ దృశ్యాలు
అనుమానం వచ్చిన యువకులు వారిని బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి పారిపోయిన స్థలానికి చేరుకుని చూడగా అక్కడ భీతావహ దృశ్యాలు కనిపించాయి. క్షుద్రపూజలకు, గుప్తనిధుల తవ్వకాలకు ఉపయోగించే విస్తారమైన పూజా సామాగ్రి అక్కడ చెల్లాచెదురుగా పడి ఉంది. నిమ్మకాయలు, గుమ్మడికాయ, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అగరుబత్తులతో పాటు వెలిగించిన దీపాలు మట్టితో చేసిన వింత బొమ్మలు ప్రత్యక్షంగా లభ్యమయ్యాయి. వీటన్నింటితో పాటు ఘోరంగా బలి ఇచ్చిన కోడి, మేకకు సంబంధించిన తోలు, కాళ్లు, పొట్ట పేగులను అక్కడ పడేసారు. పూజలు చేసిన దుండగులు స్నానాలు ఆచరించి వదిలివేసిన బట్టలు కూడా అక్కడే ఉండటం గమనార్హం. ఈ విషయం క్షణాల్లో మండల కేంద్రమంతటా వ్యాపించడంతో, యువకులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
పోలీసుల రంగప్రవేశం – దర్యాప్తు ప్రారంభం
గత కొంతకాలంగా రాత్రి వేళల్లో ఈ రిజర్వాయర్ పరిసరాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, ముఠాల సంచారం ఎక్కువైందని గుప్తనిధుల వేట అనాధికార పూజలు మూఢనమ్మకాలతో చేసే క్షుద్రపూజలకు ఈ స్థలం అణువుగా మారిందని ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, పర్వతాల శివాలయంగుట్ట, రిజర్వాయర్ ప్రాంతంలో నిఘా, రాత్రి పూట పోలీసు గస్తీని పెంచాలని గ్రామస్థులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. కాగా, అక్కడ లభించిన వస్తువులు నిజంగా క్షుద్రపూజలకే వాడారా లేక మరేదైనా ఆచారమా అనే కోణంలో స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి వాస్తవాలను త్వరలోనే వెలుగులోకి తెస్తామని స్పష్టం చేశారు.






