ములుగు అడవుల్లో తునికాకు సేకరణ షురూ.. కట్టకు రూ.2 చెల్లించాలని డిమాండ్

by Ajay Maddhiboyina |

ములుగు జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు సైతం అదనపు ఆదాయం కోసం అడవుల బాట పడుతున్నారు. కూలీలు అడవిలోనే తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుని ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు.

ములుగు అడవుల్లో తునికాకు సేకరణ షురూ.. కట్టకు రూ.2 చెల్లించాలని డిమాండ్
X

ములుగు జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు సైతం అదనపు ఆదాయం కోసం అడవుల బాట పడుతున్నారు. కూలీలు అడవిలోనే తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుని ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. గతంలో గాలివానలు, అగ్నిప్రమాదాల వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫ్రూనింగ్ పేరుతో చెట్లకు నిప్పు పెడుతున్న ఆరుగురు కాంట్రాక్టర్లపై కేసులు నమోదయ్యాయి. కేసులు ఎత్తివేస్తేనే ఆకు సేకరణ చేస్తామని కాంట్రాక్టర్లు భీష్మించుకోవడం చర్చనీయాంశమైంది. 50 ఆకుల కట్టకు రూ.2కూలితోపాటు పెండింగ్ బోనస్‌లు ఇవ్వాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.

- దిశ, ములుగు ప్రతినిధి

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ప్రతి ఏటా వేసవి కాలంలో ములుగు జిల్లాలోని పేద గిరిజన, గిరిజనేతరులకు తునికాకు సేకరణ ప్రధాన ఆదాయ మార్గంగా మారుతోంది. జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతం తునికాకుకు నిలయం కావడంతో ఆకు సేకరించే సమయం ఆసన్నమవగానే పల్లెలు ఖాళీ అవుతున్నాయి. పెట్టుబడి లేకుండా ఆదాయం లభిస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు సైతం అడవుల బాట పడుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో అనధికారికంగా సేకరణ మొదలవ్వగా, అధికారికంగా సేకరణను ప్రారంభించేందుకు అటవీశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

అడవిలో గుడారాలు.. పొంచి ఉన్న ప్రమాదాలు

ఆకు సేకరణ కోసం వెళ్లే కూలీలు పక్షం రోజుల పాటు అడవిలోనే తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, ఈ గుడారాల వల్ల గతంలో అనేక ప్రమాదాలు సంభవించాయి. గాలివానలకు గుడారాలు లేచిపోవడం, అగ్నిప్రమాదాలు జరగడం వంటి ఘటనలు కూలీలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అంతేకాకుండా, దట్టమైన అటవీ ప్రాంతంలో విషపురుగుల భారిన పడి కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్లే చొరవ తీసుకుని కూలీలకు సురక్షితమైన వసతులు, వైద్య సదుపాయాలు కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

ఫ్రూనింగ్ పేరుతో నిప్పు.. కాంట్రాక్టర్ల సిండికేట్..

పచ్చని ఆకులు రావడానికి అటవీశాఖ ‘ఫ్రూనింగ్’ (కొమ్మలు నరకడం)కు అనుమతిస్తుండగా, కొంతమంది కాంట్రాక్టర్లు ఖర్చును ఆదా చేసేందుకు ఏకంగా చెట్లకు నిప్పు పెడుతున్నారు. దీనివల్ల అడవి తగలబడటమే కాకుండా సమీపంలోని గుడిసెలు కూడా అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురు కాంట్రాక్టర్లపై అటవీశాఖ కేసులు నమోదు చేసింది. అయితే, ఈ కేసులను ఉపసంహరించుకుంటేనే ఆకు సేకరణ చేపడతామని కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి పట్టుబట్టడం వల్ల సేకరణ ప్రక్రియ కొంత ఆలస్యమవుతోంది.

ధర పెంచాలని డిమాండ్...

పెరిగిన ధరల దృష్ట్యా 50 ఆకుల తునికాకు కట్టకు రూ.2 చెల్లించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో చెల్లించిన రూ.1.25 పైసలు తమకు ఏమాత్రం సరిపోవడం లేదని, బోనస్ డబ్బులు కూడా సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకు సేకరణ సమయంలో తాగునీరు, ప్రాథమిక చికిత్స సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. జిల్లాలోని నాలుగు డివిజన్ల ద్వారా సేకరణ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని డీఎఫ్ఓ తెలిపారు.

పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం : డీఎఫ్ఓ వికాస్ మీనా

జిల్లాలో సేకరించే తూనికాకు వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా అటవీశాఖ అధికారి వికాస్ మీనా తెలిపారు. ఆకు సేకరణపై వివరణ కోరగా జిల్లాలో నాలుగు డివిజన్ల ద్వారా ఆకు సేకరించడం జరుగుతుందని, సంబంధిత అధికారులతో చర్చించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Next Story