గంజాయి ర‌వాణా దారులు ముగ్గురు అరెస్ట్

by Ratna Kumari |

ముగ్గురు గంజాయి ర‌వాణా దారులు అరెస్టైన ఘ‌ట‌న కొత్తపల్లిగోరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

గంజాయి ర‌వాణా దారులు  ముగ్గురు అరెస్ట్
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : ముగ్గురు గంజాయి ర‌వాణా దారులు అరెస్టైన ఘ‌ట‌న కొత్తపల్లిగోరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేర‌కు కొత్తపల్లిగోరి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో పోలీసులు సమర్థవంతంగా చర్యలు తీసుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి 2.310 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మంగ‌ళ‌వారం విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు సీఐ క‌రుణాక‌ర్ ఆదేశాల మేర‌కు ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో పోలీస్ బృందం, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఈ ఆప‌రేష‌న్ లో భాగంగా భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలం జెంషెడ్ బేగ్ పేట బ్రిడ్జ్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్ లేని బ్లాక్ కలర్ పల్సర్ బైక్‌పై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపడానికి ప్రయత్నించగా.. వారు పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంటాడి వారిని అదుపులోకి తీసుకున్నారు. రేగొండ గ్రామానికి చెందిన బైర‌గాని గ‌ణేష్, న‌ర్సాపూర్ గ్రామానికి చెందిన పాయం వ‌ర్షిత్, తాడ్వాయి మండ‌లంలోని వెంక‌టేశ్వ‌ర్ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన బీస ప్ర‌వీణ్ ల వ‌ద్ద ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను త‌నిఖీ చేయ‌గా.. మొత్తం 2.310 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. దీని విలువ దాదాపు రూ.1,00,000 వ‌ర‌కు ఉంటుంద‌ని అంచెనా వేశారు.


గంజాయి రవాణాకు ఉపయోగించిన నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి కొత్తపల్లిగోరి, పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు ఒప్పుకున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాలనే ఉద్దేశంతో ఈ అక్రమ వ్యాపారంలో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి నిందితుల‌ను కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌నున్న‌ట్టు తెలిపారు. గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ జిల్లాలో మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణా, విక్ర‌యాల‌పై క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని తెలిపారు. ముఖ్యంగా యువ‌త మాద‌క ద్ర‌వ్యాల‌కు దూరంగా ఉండాల‌ని.. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండి అనుమాన‌స్ప‌ద కార్య‌క‌లాపాల గురించి వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని తెలిపారు.

Next Story