డాక్టర్ ను బెదిరించిన ముగ్గురి అరెస్ట్

by velandi.Saikiran |

ప్రముఖ డాక్టర్‌ను హ‌త్య చేసేందుకు రూ.15 కోట్లు సుపారీ వచ్చిందని డబ్బులు వసూలు చేయాలని కుట్ర పన్నిన ముగ్గురు నిందితులను హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

డాక్టర్ ను బెదిరించిన ముగ్గురి అరెస్ట్
X

దిశ, వరంగల్ బ్యూరో: ప్రముఖ డాక్టర్‌ను హ‌త్య చేసేందుకు రూ.15 కోట్లు సుపారీ వచ్చిందని డబ్బులు వసూలు చేయాలని కుట్ర పన్నిన ముగ్గురు నిందితులను హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి పైన కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు దిల్ షుక్ నగర్ హైదరాబాద్ కి చెందిన యమగోని సుభాష్ గౌడ్ గతంలో హన్మకొండ లోని రెనోవా హాస్పిటల్‌లో ప్రముఖ డాక్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. తన ప్రవర్తన డాక్టర్ కు నచ్చక తనను ఉద్యోగం నుండి తీసివేశాడు. అ విషయం మనసులో పెట్టుకొని తాను పని చేసిన డాక్టర్ చాలా ధనవంతుడు కావడంతో అతడిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు అయిన సైదాపూర్ మండలం కరీంనగర్ కు చెందిన శ్రీ మూర్తి శ్రీనివాస్‌కు చెప్పగా, అతడు కూడా డబ్బు ఆశతో అంగీకరించాడు.

శ్రీ మూర్తి శ్రీనివాస్‌ కు స్నేహితుడు అయిన అయిన అజ్మీర నాయక్ నెక్కొండ మండలం వరంగల్ కు చెందిన బానోత్ రమేష్‌ను తమతో కలుపుకుని ముగ్గురు కలిసి కుట్ర పన్నారు. సుభాష్‌కు డాక్టర్ కుటుంబ సభ్యుల వివారాలు, వారి ప్రయాణ వివారాలు, డాక్టర్ నివాసం, అతని వాహన వివారాలు తదితరాలు తెలుసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రెనోవా హాస్పిటల్‌లో వేరొక డాక్టర్ వద్ద పనిచేస్తున్న శ్రీ మూర్తి శ్రీనివాస్, డాక్టర్ కదలికలపై సమాచారం అందించేవాడు. ఆ సమాచారంతో బానోత్ రమేష్ డాక్టర్‌కు ఫోన్ చేసి, తనను చంపేందుకు రూ.15 కోట్ల సుపారి వచ్చిందని, డబ్బులు ఇవ్వకపోతే హత్య చేస్తామని బెదిరించాడు. ఈ బెదిరింపు కాల్స్ అనంతరం డాక్టర్ పోలీసులను ఆశ్రయించగా సాంకేతిక ఆధారాలు, కాల్ వివరాలు మరియు నిఘా ద్వారా నిందితుల కదలికలను గుర్తించి అరెస్ట్ చేసినారు.

ముగ్గురు మరోసారి హాస్పిటల్ వద్ద రెక్కీ నిర్వహించేందుకు వస్తుండగా, ములుగు క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీల సందర్భంగా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అరెస్టు చేశామని సి ఐ మచ్చ శివకుమార్ తెలిపారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన 4 మొబైల్ ఫోన్లు,హీరో షైన్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు చేదించడం లో కృషి చేసిన ఎస్ ఐ కె.కిషోర్, HC రాహూఫ్,సోము నాయక్, కాన్స్టేబుల్స్ రమణ, మహిపాల్, హోంగార్డు రవి, కుమారస్వామి లను సిఐ మచ్చ శివ కుమార్ గారు అభినందించారు. ప్రజలు ఎటువంటి బెదిరింపు కాల్స్, డబ్బు డిమాండ్లు లేదా అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా అత్యవసర పోలీస్ సేవలను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Next Story