బచ్చన్నపేటలో దొంగల బీభత్సం..

by Kodari Anjali |

బచ్చన్నపేట మండలంలో దొంగలు హల్ చల్ చేశారు.

బచ్చన్నపేటలో దొంగల బీభత్సం..
X

దిశ, బచ్చన్నపేట: మండలంలో దొంగలు హల్ చల్ చేశారు. పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... బచ్చన్నపేటలోని వి ఎస్ ఆర్ నగర్‌కు చెందిన బొడ్డు కరుణాకర్ (32) అనే ట్రాక్టర్ డ్రైవర్, ఉదయం 9 గంటల సమయంలో తన భార్యతో కలిసి ఇళ్లకు తాళం వేసి, కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్దకు వెళ్లారు. సాయంత్రం 3 గంటల సమయంలో గ్రామస్తుడు బొడ్డు అయిలయ్య ఫోన్ చేసి, ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని సమాచారం ఇచ్చారు. కరుణాకర్ దంపతులు వెంటనే ఇంటికి వచ్చి పరిశీలించగా, గుర్తుతెలియని దుండగులు ఇంటి మెయిన్ డోర్ తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బెడ్‌రూమ్‌లోని బీరువా లాకర్‌ను బద్దలు కొట్టి అందులో దాచిన రూ. 30,000 నగదు, 6 తులాల వెండి పట్టీలు, 3 తులాల వెండి గిన్నె, స్పూన్ (వెండి విలువ రూ. 5,000) మరియు రూ. 30,000 విలువచేసే అర తులం బంగారు చెవి రింగులను దొంగిలించారు. మొత్తంగా రూ. 65,000 విలువైన సొత్తును దుండగులు అపహరించుకుపోయారు. ఈ మేరకు బాధితుడు బొడ్డు కరుణాకర్ బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Next Story