వైన్ షాపు ముందు వాహనాల రద్దీ ప్రయాణికులకు అవస్తలు

by Ratna Kumari |

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో ఉన్న వైన్స్ షాప్ ప్రధాన రహదారి ప్రక్కనే ఉండటంతో అటు ప్రజలు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వైన్ షాపు ముందు వాహనాల రద్దీ ప్రయాణికులకు అవస్తలు
X

దిశ, ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో ఉన్న వైన్స్ షాప్ ప్రధాన రహదారి ప్రక్కనే ఉండటంతో అటు ప్రజలు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రమైందంటే చాలు మందుబాబులు మందు కోసం ఎగబడుతుండటంతో ఇటు ప్రయాణికులు, అటు స్కూల్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. మద్యం ప్రియులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేసి మద్యం కొనుగోలుకు వెళ్తుండటంతో అటుగా వెళ్లే ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మసాగర్ నుండి ముప్పారం, నారాయణగిరి గ్రామాల మీదుగా బండతండా, కమ్మరిపేట, ఎర్రబెల్లి, వేలేరు, పీచర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఇదే మార్గం గుండా బస్సులలో, ద్విచక్ర వాహనాల పై వెళ్తుంటారు.

ప్రధాన రోడ్డు ప్రక్కనే వైన్స్ ఉండటంతో మందు కోసం వచ్చే మందుబాబులు వారి వాహనాలను వైన్స్ షాపు ముందు రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఈ మార్గం గుండా ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం సమయంలో వైన్స్ షాపు వద్ద ట్రాఫిక్ జామ్ కావ‌డంతో అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి. వైన్స్ షాపు ముందు వాహనాల రద్దీ వల్ల ఆర్టీసీ బస్సులు సైతం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మందుబాబులు రోడ్డు పై చేసే వెకిలి చేష్టలకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారి ప్రక్కన వైన్స్ షాపులను పెట్టొద్దనే నియమం ఉన్నప్పటికీ ఆ నియామన్ని ఇక్కడ వైన్స్ షాపు నిర్వాహకులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైన్స్ షాపుని ఇక్కడి నుండి తీసివేసి గ్రామ శివారులో పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, వైన్స్ షాపు ని అక్కడి నుండి తొలగించాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Next Story