- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజుకుంటున్నరాజకీయ వేడి
ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికల తర్వాత రాజకీయ వేడి రాజుకుంటుంది.

దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికల తర్వాత రాజకీయ వేడి రాజుకుంటుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటా పోటీ ఫలితాలు రావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై దృష్టి పెట్టి కార్యక్రమాలు చేపడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒకరికొకరు ఢీకొట్టుకుంటున్నారు. భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు మెజార్టీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కన్నా ఎక్కువ గ్రామాల్లో గెలవడంతో అదే ఊపుతో కార్యక్రమాలు చేపడుతున్నారు. కొత్తగా నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే నూతనంగా ఎన్నికైన సర్పంచులను, వార్డు సభ్యులను సన్మానిస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి తాము అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. ప్రతిపక్షాని కంటే ఎక్కువగా గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రావడంతో దానిని కాపాడుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిప్పలు పడుతున్నారు.
ఢీ అంటే ఢీ..
ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామపంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులో కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నిప్పు రాజుకుంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే రాజయ్యల మధ్య నిత్యం ఈ మంట పెరుగుతూనే ఉంది. ఎమ్మెల్యే పై మాజీ ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపణలు చేస్తుండగా కాంగ్రెసు నేతలు తిప్పి కొడుతున్నారు. పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్టుసాధించగా స్పీకర్ నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది. పాలకుర్తి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య నిత్యం వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. నర్సంపేట నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభివృద్ధి పనులు చేస్తున్నారు. అదే రీతిలో బీ ఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరకాల నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. భూపాలపల్లి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అన్ని తానై వ్యవహరిస్తున్నారు.
డొర్నకల్ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే, విప్ రామచందర్ నాయక్, మాజీ మంత్రులు రెడ్యానాయక్, మధ్య పోటీ ఎక్కువగా ఉంది. మహబూబాబాద్ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే మురళినాయక్, మాజీ ఎమ్మెల్యే మధ్య నిత్యం వేడి రాజుకుంటూనే ఉంది. మిగతా జిల్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎవరిది పై చేయిగా ఉంటుందో ఎవరు పట్టు సాధిస్తారో తేలనుంది.






