- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహా జాతరకి ముస్తాబైన మేడారం
ఆసియా ఖండంలోనే ఆదివాసీల అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక సమ్మక్క సారక్క జాతరకు సర్వం సిద్ధమైంది. ఈనెల 28 నుంచి 31 వరకు మహా వేడుకకు అమ్మవార్ల గద్దెలు సుందరంగా ముస్తాబయ్యాయి.

దిశ, వరంగల్ బ్యూరో: ఆసియా ఖండంలోనే ఆదివాసీల అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక సమ్మక్క సారక్క జాతరకు సర్వం సిద్ధమైంది. ఈనెల 28 నుంచి 31 వరకు మహా వేడుకకు అమ్మవార్ల గద్దెలు సుందరంగా ముస్తాబయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేసింది. గతంలో సుమారు రెండు కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోగా, ఈ సారి మూడు కోట్ల మందికి పైగా తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్లు కేటాయించి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ద్వారా జాతరలో గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించింది. వందేళ్లు ఉండేలా.. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలు ఉట్టిపడేలా రాతి కట్టడాలపై వివిధ మూర్తుల ఆకృతులను చెక్కారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలిరానున్నారు.
సారలమ్మ రాకతో..
ఈనెల 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మను, కొండాయి నుంచి గోవిందరాజు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెపైకి తీసుకురావడంతో జాతర ఆరంభమవుతుంది. 29న సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెలపైకి రావడంతో మొక్కులు చెల్లించుకోవడం ప్రారంభమవుతుంది. ఈనెల 30న వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 31న సాయంత్రం సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవిందరాజు, పగిడిద్దరాజు వనదేవతలు వనప్రవేశం తో జాతర ముగియనుంది.
విధుల్లో 42 వేల మంది..
మేడారం జాతర నిర్వహణలో మొత్తం 42,027 మంది విధులు నిర్వహించనున్నారు. నాలుగు రోజుల్లోనే 30,904 మంది అధికారులు, సిబ్బంది సేవలు అందించనున్నారు. 49 రహదారుల్లో మరమ్మతులు, విస్తరణ పనులు చేపట్టగా.. కొత్తగా 10 రోడ్లు, మూడు ప్రదేశాల్లో కల్వర్టులు నిర్మించారు. వాహనాల నియంత్రణ కోసం ఏకదశ, ద్విదశ రూట్లను స్పష్టంగా గుర్తించి ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ అవసరాల కోసం 42 ప్రదేశాల్లో 1,418 ఎకరాలను కేటాయించారు.
రూ.202 కోట్లతో అభివృద్ధి పనులు..
రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ.202.7కోట్ల వ్యయంతో మేడారం జాతర కోసం పనులు చేపట్టారు. వనదేవతల గద్దెల పునర్నిర్మాణం, నాలుగు లేన్ల రోడ్ల అభివృద్ధి, ప్రధాన జంక్షన్ల సుందరీకరణ, హెలిప్యాడ్ల మరమ్మతులు వంటి కీలక పనులు పూర్తి చేశారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా రూ.53.21 కోట్ల వ్యయంతో 84 పనులు చేపట్టారు. జాతరలో పారిశుద్ధ్య నిర్వహణకు 5,700 మరుగుదొడ్లు, 285 టాయిలెట్ బ్లాకులు సిద్ధం చేస్తున్నారు. కరెంట్ సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది.
డిజిటల్ మేడారం..
భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం ఈ సారి డిజిటల్ టెక్నాలజీ పెద్దపీట వేసింది. ‘medaram jatara 2026’ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్ ను ప్రారంభించింది. medaramjathara2026.com అనే అధికారిక వెబ్‌సైట్ ను ప్రారంభించింది. ‘My Medaram Whatsapp’ చాట్‌బాట్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది. భక్తులు 7658912300 నెంబర్ కు వాట్సాప్ లో హాయ్ అని టైప్ చేస్తే ఈ సేవలను తెలుగు, ఆంగ్ల భాషల్లో వాడుకోవచ్చు.
పోలీస్ శాఖ ఏఐ సేవలు..
పోలీస్ శాఖ తొలిసారి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత వ్యవస్థలను ఉపయోగిస్తున్నది. జాతరలో భద్రతను పర్యవేక్షించేందుకు ‘టీజీ-క్వెస్ట్’ అనే అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ ద్వారా 30 కి.మీ. మేర విస్తరించిన అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీ రోడ్లపై ఈ డ్రోన్లు నిరంతరం నిఘా ఉంటాయి. ఈ జాతర కోసం 13 వేల మంది పోలీస్ సిబ్బంది సాంకేతిక నిఘాలో విధులు నిర్వహించనున్నారు. హీలియం బెలూన్లకు అమర్చిన పాన్ టిల్ట్ జూమ్ కెమెరాలు ఎత్తు నుంచి రద్దీని విశ్లేషిస్తాయి. శబరిమల తరహాలో వ్యక్తులు తప్పిపోకుండా ఈసారి ‘జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’ వ్యవస్థను తీసుకొస్తున్నారు.






