వర్కింగ్ జర్నలిస్టుల అభ్యున్నతికి అండగా ప్రభుత్వం

by Ratna Kumari |

వర్కింగ్ జర్నలిస్టుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

వర్కింగ్ జర్నలిస్టుల అభ్యున్నతికి అండగా ప్రభుత్వం
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : వర్కింగ్ జర్నలిస్టుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా వర్కింగ్ జర్నలిస్టులకు తన వంతుగా ఎల్లప్పుడు తోడ్పాటును అందిస్తానని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఐజేయూ) మహా సభకు కుడా చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైందన్నారు.

ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి దిశానిర్దేశం చేసే బాధ్యత జర్నలిస్టులపై ఉందని పేర్కొన్నారు. కష్ట, నష్టాలను ఎదుర్కొంటూ ప్రజల కోసం పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. హనుమకొండ జిల్లా జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్య భద్రత, ఇళ్ల‌ స్థలాలు, అక్రిడిటేషన్ తదితర అంశాల్లో తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ కుడా పరిధిలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం అవసరమైన భూమిని గుర్తిస్తే అభివృద్ధి చేయవచ్చునని అన్నారు. జర్నలిస్టులకు కుడా పరంగా అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద జర్నలిస్టు యూనియన్ ఐజేయూ అని, రాష్ట్రంలో 33 జిల్లాలో కూడా బలమైన నిర్మాణం కలిగి ఉందని అన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నదని అన్నారు. టీయూడబ్ల్యూజేే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాం నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల ఏ సమస్య వచ్చింది ముందుండి పోరాడేది టీయూడబ్ల్యూజేే మాత్రమేనని అన్నారు.

టీయూడబ్ల్యూజేే జిల్లా నాయకులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డిని ఘనంగా సన్మానించి, జర్నలిస్టుల పట్ల చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు విధి నిర్వహణలో పలు కారణాల చేత మృతి చెందిన జర్నలిస్టుల మౌనం వహిస్తూ సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్ కార్యదర్శి నివేదిక ప్రవేశ పెట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపెల్లి మధు, కార్యవర్గ సభ్యులు పి. వేణుమాధవ్ కంకనాల సంతోష్, జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లాల వెంకటరమణ, పీవీ మదన్ మోహన్, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాంచందర్, దుర్గా ప్రసాద్, ములుగు జిల్లా అధ్యక్షుడు ఎండి. షఫి, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు గడ్డం కేశవ మూర్తి, పిన్నా శివకుమార్, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బోల్ల అమర్, పలువురు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.

Next Story