మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట..

by Taduka Kalyani |

మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట..
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై డివిజన్‌ల వారీగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం 5,344 స్వయం సహాయక సంఘాల ద్వారా 58,784 మంది మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. ఇటీవల మరో 93 కొత్త సంఘాలను ఏర్పాటు చేసి, 930 మంది మహిళలను సభ్యులుగా చేర్చినట్లు తెలిపారు. దివ్యాంగుల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ 66 ప్రత్యేక స్వయం సహాయక సంఘాలను, వీధి వ్యాపారుల సంక్షేమం కోసం 12 సంఘాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.2026 మార్చి 31 నాటికి 1,072 స్వయం సహాయక సంఘాలకు రూ.121.24 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రూ.21.06 కోట్ల స్త్రీనిధి రుణాలు, రూ.87 లక్షల వడ్డీలేని రుణాలు అందించినట్లు తెలిపారు .ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 742 మంది మహిళలకు రూ.11.68 కోట్ల వ్యక్తిగత రుణాలను అందజేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, క్యాటరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మహిళలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story