- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతన్నల ఆగ్రహ జ్వాల..!
ఆరుగాలం కష్టపడి మొక్కజొన్న పండించిన రైతన్నకు నిరాశే ఎదురవుతోంది. రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు చెమటోడ్చి పండించిన పంటకు నిప్పు పెట్టే దారుణ పరిస్థితికి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం ప్రధాన రహదారి వేదికైంది.

దిశ, నర్సంపేట : ఆరుగాలం కష్టపడి మొక్కజొన్న పండించిన రైతన్నకు నిరాశే ఎదురవుతోంది. రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు చెమటోడ్చి పండించిన పంటకు నిప్పు పెట్టే దారుణ పరిస్థితికి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం ప్రధాన రహదారి వేదికైంది. అప్పులు తీర్చుకోవడం కోసం పంటను అమ్ముకుందామని వస్తే పాత అప్పులు తీరక పోగా బస్తాల రూపంలో, ట్రాన్స్ పోర్టు వాహనాల ఖర్చుల రూపంలో మక్క రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోతున్న దౌర్భాగ్య పరిస్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏం చేయాలో తెలియని నిస్సహాయతలో పండించిన పంటకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. నల్లబెల్లి మండలంలో నెల రోజుల నుండి రైతులు కొనుగోలు సెంటర్ల వద్ద నిరీక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. వారాలు గడుస్తున్నా కనీసం అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు సెంటర్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని నల్లబెల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ట్రాక్టర్లు అడ్డంపెట్టి రాస్తారోకో చేశారు. రైతులకు మద్దతుగా వామపక్ష నేతలు ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు పండించిన పంటలను వెంటనే కాంటాలు నిర్వహించి కొనుగోలు చేయాలని వారు ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక తహసిల్దార్ ఉప్పు కృష్ణ కొనుగోలు సెంటర్ లో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎస్సై సాయి ప్రసన్నకుమార్ ధర్నానంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో వాపక్ష నాయకులు దామ సాంబయ్య మార్త నాగరాజు రైతులు పాల్గొన్నారు.






