- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా ప్రభుత్వాన్ని భక్తులు ఎన్నటికీ మరిచిపోలేరు : కడియం శ్రీహరి
మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు వెయ్యి సంవత్సరాల పాటు నిలిచిపోయే విధంగా చేపట్టారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు వెయ్యి సంవత్సరాల పాటు నిలిచిపోయే విధంగా చేపట్టారని, ప్రజా ప్రభుత్వం భక్తుల కోసం చేపడుతున్న సౌకర్యాలను భక్తులు ఎన్నటికీ మర్చిపోలేరని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి తన నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించగా, గిరిజన పూజారులు తమ సంప్రదాయం ప్రకారం తోడుకొని గద్దెలపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర నూతన వైభవాన్ని సంతరించుకుందని అన్నారు. వెయ్యి సంవత్సరాల పాటు నిలిచిపోయేలా గద్దెల ప్రాంగణాన్ని ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పునర్నిర్మాణం చేయడం మహా అద్భుతంగా ఉందని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లతో మేడారంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. అడవి తల్లుల చరిత్రను చాటిచెప్పేలా, కోయ సంస్కృతికి అద్దం పట్టే విధంగా అనేక శిల్పాలు, బొమ్మలు రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు.
గతంలో జాతర సమయంలో మాత్రమే భక్తులు వచ్చేవారని, ప్రస్తుతం ఏడాది పొడవునా భక్తులు వస్తుండటంతో శాశ్వత ఏర్పాట్లు చేశారని తెలిపారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆరు పర్యాయాలు మేడారం జాతర ఏర్పాట్లను పర్యవేక్షించి, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని గుర్తు చేశారు. గతంలో ఉన్న దానికంటే మిన్నగా కాంగ్రెస్ ప్రభుత్వం మేడారం మహాజాతర అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిందని హర్షం వ్యక్తం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని విమర్శించారు. ఉత్తరాది ఆలయాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, కోట్లాది మంది ప్రజలు, గిరిజనుల దక్షిణాది కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారానికి మాత్రం నామమాత్రపు నిధులు కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని అన్నారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వివక్షను వీడి, కోట్లాది ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తూ తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






