బస్సైనా, ఎడ్లబండైనా… లక్ష్యం ఒక్కటే మేడారం!

by velandi.Saikiran |

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సమీపిస్తున్న వేళ ఏజెన్సీ ప్రాంతమంతా భక్తిశ్రద్ధలతో నిండిపోయింది.

బస్సైనా, ఎడ్లబండైనా… లక్ష్యం ఒక్కటే మేడారం!
X

దిశ, కొత్తగూడ: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సమీపిస్తున్న వేళ ఏజెన్సీ ప్రాంతమంతా భక్తిశ్రద్ధలతో నిండిపోయింది. పిల్లాపాప, చిన్నపెద్దా అన్న తేడా లేకుండా గిరిజన గ్రామాల నుంచి భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం సమ్మక్క–సారలమ్మ తల్లుల దర్శనం కోసం తెల్లవారుజామునుంచే మేడారం బాట పట్టారు. కాలినడకనతో పాటు ఆర్‌టీసీ బస్సులు, ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు, ఎడ్లబండ్లు, కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో భక్తులు అమ్మల చెంతకు చేరుకుంటున్నారు. కొత్తగూడ, గంగారం ఏజెన్సీ మండలాల నుంచి భక్తుల రాకతో రహదారులు, బస్టాండ్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నప్పటికీ, భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో రద్దీ కొనసాగుతోంది. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఏజెన్సీ మండలాల్లో మేడారం యాత్ర పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.చలి–ఎండలను సైతం లెక్కచేయకుండా, ప్రయాణ కష్టాలు, రద్దీ ఏవీ పట్టించుకోకుండా అమ్మల దర్శనం కోసం భక్తులు ముందుకు సాగుతున్నారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం దర్శనం మాత్రం ఆగదు … తగ్గేదేలే అంటూ భక్తులు వ్యక్తం చేస్తున్న అపార విశ్వాసమే మేడారం మహాజాతర విశిష్టత.

Next Story