అంబరాన్నంటిన ఆవిర్భావం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెండావిష్కరణలు

by Ajay Maddhiboyina |

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఉమ్మడి వరంగల్​జిల్లావ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రాలతోపాటు గ్రామగ్రామన జాతీయ జెండాలను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు.

అంబరాన్నంటిన ఆవిర్భావం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెండావిష్కరణలు
X

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఉమ్మడి వరంగల్​జిల్లావ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రాలతోపాటు గ్రామగ్రామన జాతీయ జెండాలను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. హన్మకొండ పరేడ్​గ్రౌండ్​లోనిర్వహించిన వేడుకలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై జెండా ఆవిష్కరించారు. అమరుల త్యాగులను స్మరించుకుని వారి కుటుంబాలకు సన్మానం చేశారు. ఖిలావరంగల్​ఖుల్​మహల్​లో నిర్వహించిన వేడుకలకు మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ములుగు వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్ని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ అని కొనియాడారు. మానుకోట కలెక్టరేట్​లో ప్రభుత్వ విప్​రాంచంద్రునాయక్, భూపాలపల్లిలో ప్రభుత్వ విప్ శ్రీనివాస్ రెడ్డి, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జాతీయ జెండాలను ఆవిష్కరించి ప్రసంగించారు. అనంతరం ఉత్తమ సేవలకుగాను పలువురికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ ఆకట్టుకున్నాయి.

దిశ వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్​జిల్లావాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందన్నారు. తెలంగాణ సాధన కోసం అమరవీరులు చేసిన త్యాగాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయ న్నారు. అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి తెలంగాణ పోలీసు సేవా పతకాలను, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

ఖుష్​మహల్ లో..

ఖిలా వరంగల్ ఖుష్‌మహల్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్ తో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జిల్లా ప్రగతి సందేశానికి ప్రజలకు వివరించారు.

తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా: మంత్రి సీతక్క

ములుగు జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన మహాతల్లి సోనియాగాంధీని మంత్రి సీతక్క అన్నారు. ములుగు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల జీవితాలలో విశేష మార్పులు తీసుకువచ్చాయన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు చేస్తున్న సేవలను ఎన్నటికీ మరువలేమని అన్నారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ రాజీవ్ మీనా, మున్సిపల్ చైర్మన్ చింత నిప్పుల చంద్రకళ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్​పర్సన్ రేగ కళ్యాణి, అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు పాల్గొన్నారు.

మానుకోటలో..

మహబూబాబాద్ టౌన్: మానుకోట కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలకు ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ హాజరై జెండా ఆవిష్కరించారు. రెండవ దశ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు అందచేశారు. అంతకు ముందు కోర్టు సెంటర్లో తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్, కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ డాక్టర్ శబరీష్, డీఎఫ్ఓ విశాల్ బత్తుల, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, జెడ్పీ సీఈవో పురుషోత్తం, ఆర్డీఓ క్రిష్ణవేణి, మున్సిపల్ చైర్​పర్సన్ గుగులోతు జ్యోతి, జిల్లా రెవెన్యూ అధికారి నాగలక్ష్మి పాల్గొన్నారు.

ఏటూరునాగారం ఐటీడీఏలో..

ఏటూరు నాగారం: ఏటూరునాగారం ఐటీడీఏలో ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వత్సల్ టోప్పో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనార్దన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజ్‌కుమార్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్(ఏ) డా. కె. క్రాంతి పాల్గొన్నారు.

సంక్షోభం నుంచి సంక్షేమం వైపు : ప్రభుత్వ విప్ శ్రీనివాస్ రెడ్డి

భూపాలపల్లి ప్రతినిధి: సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు.. విధ్వంసం నుంచివికాసం వైపు తీసుకెళ్తున్నామని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం భూపాలపల్లి కలెక్టరేట్​ లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, గ్రంథాలయ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ పాల్గొన్నారు.

కేయూలో ఆవిర్భావ వేడుకలు..

హన్మకొండ టౌన్ : కాకతీయ విశ్వవిద్యాలయ పరిపాలన భవన ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన వేడుకల్లో వీసీ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం అధ్యక్షత వహించగా వీసీ మాట్లాడారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి దిశగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

జనగామలో..

జనగామ: జనగామలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ లకావత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు.

Next Story