- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది
తల్లిదండ్రులు జన్మనిస్తే, గురువు జ్ఞానాన్ని అందించి జీవితానికి సరైన మార్గాన్ని చూపిస్తారని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.

దిశ, పెద్దవంగర: తల్లిదండ్రులు జన్మనిస్తే, గురువు జ్ఞానాన్ని అందించి జీవితానికి సరైన మార్గాన్ని చూపిస్తారని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుడు ఎంతో విలువైన పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సాయి గార్డెన్‌లో నిర్వహించిన ఉపాధ్యాయుడు సోమరపు ఐలయ్య పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్య, సామాజిక చైతన్యం, ప్రజాసేవ అనే మూడు విలువలను సమన్వయం చేసుకుంటూ ఉపాధ్యాయుడిగా, ఉద్యమకారుడిగా, ప్రజాసేవకుడిగా ఐలయ్య అందించిన సేవలు అభినందనీయమన్నారు. ఉద్యోగ విరమణ అనేది ముగింపు కాదని, కొత్త అధ్యయనానికి, కొత్త అనుభవాలకు నాంది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉద్యోగ జీవితంలో చూపిన అంకితభావంతోనే ఇకపై కూడా సమాజానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని ప్రజా కవి, గాయకుడు జయరాజ్ అన్నారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు ఐలయ్యను ఆయన అభినందించారు. సమసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని జయరాజ్ సూచించారు. ఐలయ్యకు ఆయన సతీమణి పూలమ్మ అందించిన సహకారం అభినందనీయమని, కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ సేవలో ఐలయ్య ముందుండటం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి భూదారపు శ్రీనివాస్, తొర్రూర్ ఎంఈఓ బుచ్చయ్య, టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంగు మురళి, కుమారస్వామి, భానోత్ గోపాల్ నాయక్, సోమేశ్వరరావు, హెచ్‌ఎం విజయ్ కుమార్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎర్ర వెంకన్న, రమేష్ కుమార్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






