- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
మేడారం జాతరకు వచ్చే లక్షలాది భక్తుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది.

దిశ వరంగల్ బ్యూరో: మేడారం జాతరకు వచ్చే లక్షలాది భక్తుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ఒకవైపు సురక్షిత మంచినీటిని అందించడం, ముమ్మర పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం, జంపన్న వాగులో నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టడంతో పాటు పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలను కల్పించింది. మేడారం జాతర ప్రధాన వేదిక సమీపంలో టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఇదేకాకుండా 30 ప్రాంతాల్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. మొత్తం జాతరలో ఏ విధమైన ఇబ్బందులు కలుగకండా ఉండేందుకు 5192 మంది మెడికల్, పారా మెడికల్ సిబ్బందిని వైద్యఆరోగ్యశాఖ రంగంలోకి దించింది. జాతర సమయంలో 24 గంటలు వైద్య సేవలందించేందుకు గాను 649 వైద్యాధికారులు, 154 మంది ఆయుష్ డాక్టర్లు, 673 నర్సింగ్ అధికారులు, 1905 ఆశావర్కర్లు, 1,111 పారామెడికల్ సిబ్బంది, 331 సూపర్వైజరి స్టాఫ్, 700 ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.
జాతర అనంతరం మెడికల్ క్యాంప్స్..
మహా జాతరకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. అయితే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో జనం రావడం, ప్లాస్టిక్ సహా ఇతర వ్యర్థ పదార్ధాలు మేడారం పరిసర ప్రాంతాల్లో పారవేయడం మూలంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి జాతర ముగిసిన అనంతరం కూడా స్థానిక గిరిజనులకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు కలుగకుండా 10 మెడికల్ క్యాంప్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు మేడారం చుట్టూ పక్కలా ఉన్న ఏటూరు నాగారం, ములుగు, పసరా, గోవిందా రావు పేట, మంగపేట సీఎస్‌సీ ఆస్పత్రులను పటిష్ఠపరిచడం జరిగింది.
జంపన్న వాగు వద్ద గజ ఈతగాళ్లు..
మేడారం వచ్చే భక్తులు విధిగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ జంపన్న వాగులో ప్రమాదవశాత్తూ పడి ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు జంపన్న వాగు పొడవునా గజ ఈతగాళ్లను మోహరించారు. స్నానాల ఘట్టాల వద్ద సురక్షితులైన స్విమ్మర్లు, సింగరేణి, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని మొత్తం 325 మందిని నియమించారు. వీరిలో మత్స్యశాఖ ద్వారా 210 స్విమ్మర్లు, 12 మంది సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులు, 100 మంది ఎస్డీఆర్ఎఫ్ టీమ్ సభ్యులున్నారు. వీరందరికీ లైఫ్ జాకెట్లు, ప్రత్యేక టీషర్ట్స్, సెర్చ్ లైట్స్, లైఫ్ సేవింగ్ పరికరాలు అందచేశారు. జాతర మొత్తం ప్రాంగణంలో ఏవిధమైన అగ్నిప్రమాదాలు జరుగకుండా రాష్ట్ర అగ్నిమాపక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. 15 ఫైర్ బ్రిగేడ్స్, 12 మిస్ట్ బుల్లెట్స్, రెండు ఫైర్ ఇంజన్లను జాతర ప్రాంగణంలో మోహరించారు. మొత్తం 268 ఫైర్ సిబ్బంది విధుల్లో ఉంటారు.






