- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేటగాళ్లపై నిఘా.. ములుగు అడవుల్లో జంతువుల కోసం చెక్ డ్యామ్‌లు
అడవుల జిల్లాగా పేరుగాంచిన ములుగుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అటవీ విస్తీర్ణం విస్తరించి ఉండడంతో వన్యప్రాణుల ఆవాసాలకు అనువుగా మారింది.

దిశ, ములుగు ప్రతినిధి: ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి మూగజీవాలు అల్లాడుతున్నాయి. అడవుల్లో నీటి వనరులు ఎండిపోతుండడంతో జంతువులు దప్పికతో అలమటిస్తున్నాయి. ఈ క్రమంలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవి నేపథ్యంలో పక్కా ప్రణాళికతో ములుగు జిల్లా అధికారులు ముందుకుసాగుతున్నారు. వన్యప్రాణుల దాహార్తిని తీర్చడం కోసం అడవుల్లో కృత్రిమంగా నీటివనరులను ఏర్పాటు చేస్తున్నారు. వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటి నిర్మాణం చేపట్టారు. మరో వైపు వన్యప్రాణుల వేటగాళ్లపై దృష్టిసారించారు. నీటివనరుల వద్ద వేటగాళ్ల ఉచ్చులకు వన్యప్రాణులు బలికాకుండా ఉండేందుకు నిరంతరం గస్తీ, వాచ్ టవర్స్, కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వేసవిలో వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు
అడవుల జిల్లాగా పేరుగాంచిన ములుగుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అటవీ విస్తీర్ణం విస్తరించి ఉండడంతో వన్యప్రాణుల ఆవాసాలకు అనువుగా మారింది. వన్య ప్రాణుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో వాటి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో వన్యప్రాణులు ఆహారం, నీటి కోసం అలమటిస్తుంటాయి. వేసవిలో అడవిలో నీటివనరులు అడుగంటిపోవడంతో వన్యప్రాణు లు నీటికోసం జనసంచారంలోకి వస్తుంటాయి. ఈ క్రమంలో వేటగాళ్లబారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. వన్యప్రాణుల దాహార్తి తీర్చడం కోసం ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతంలో తాత్కాలిక నీటి వనరులను ఏర్పాటు చేస్తున్నా రు. వన్యప్రాణుల ఆకలి, దప్పిక కోసం ఎంచుకున్న ప్రదేశాల్లో కృత్రిమంగా నీరు నిల్వ ఉండేలాగా చెక్ డ్యాంలు నిర్మిస్తున్నారు. నీటి వనరులు లేని చోట బోర్లు వేసి సోలార్ తో నడిచే మోటార్లను బిగిస్తున్నారు. తద్వారా వన్యప్రాణుల కోసం నీరు, గడ్డి కొరతను తీర్చగలుగుతున్నారు.
వేసవిలో నీటి కోసం ప్రణాళిక
2024-25 గాను 2031 ఎకరాల్లో ఉన్న అడవిలో అడవి దున్న, కొండ గొర్రెలు, ముళ్లపందులు, కృష్ణ జింకలు, నీల్ గాయ్, ఎలుగుబంటి, జింకలు, దుప్పులు, అడవి కోళ్ళు, నెమల్లు, కుందేలు మొదలగు జీవ జాతులు సంచరిస్తుంటాయి. ఎండాకాలంలో నీటి కోసం ప్రతేకంగా 150 చెక్‌డ్యాంలు,159 పర్కొలేషన్ ట్యాంకులు, 38 మినీ పర్కొలేషన్ ట్యాంకులు,14 సోలార్ పర్కొలేషన్ ట్యాంకులు, 1361 రాక్ ఫిల్ డ్యామ్‌లు, 218 సాసర్ పిట్లు ఏర్పాటు చేసినట్టు జిల్లా అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. అడవిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో, వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో వీటిని నిర్మాణం చేపట్టిన్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. వన్యప్రాణులకు అడవిలో నీటిని అందించడంతో నీటి జాడలు వెతుక్కుంటూ గ్రామాల్లోకి వచ్చే అవకాశం తక్కువ గా ఉంటుందని, నీటి లభ్యత ఉన్న చుట్టుపక్కల గడ్డి మొలిచి ఎండాకాలంలో ఆహార లభ్యత కూడా మెరుగయ్యే అవకాశం ఉంటుంది.
వేటగాళ్ల కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు
ప్రతీయేడాది వన్యప్రాణుల దాహార్తి తీర్చడం కోసం అటవీశాఖ అధికారులు నీటి కుంటలను ఏర్పాటు చేయడంతో వాటి పరిసర ప్రాంతాల చుట్టూ జీవాల ఉనికి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఆ ప్రదేశాలపై వేటగాళ్లు దృష్టి సారించి నీటి కుంటల చుట్టూ ఉచ్చులు ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో నీటి కుంటల చుట్టుపక్కల వేటగాళ్ల కట్టడికి అటవీశాఖ అధికారుల నిరంతరం గస్తీ, ఐదు వాచ్ టవర్స్ తో నిరంతర నిఘా, అడవిలో అక్కడకడ కెమెరా ట్రాప్స్ ను ఏర్పాటు చేసి వేటగాళ్లను కట్టడి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
నీటికుంటల చుట్టూ నిఘా - ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్
అటవీ జంతువుల నీటి అవసరాల కోసం శాశ్వత, తాత్కాలిక ఏర్పాట్లు పూర్తి చేశాం. సోలార్ నీటి పంపులు, సాసర్ పిట్స్, చెక్ డ్యాంలు నిర్మించి ఎప్పుడు నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అటవీ రక్షణ కోసం వాచ్ టవర్స్, అక్కడక్కడ కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశాం. నీటి వనరుల చుట్టూ 24 గంటలు ఫారెస్ట్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్నాం. అటవీ జంతువులు వేటగాళ్ల బారిన పడకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశాం.






