- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి : మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ రైతు సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ రైతు సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సెన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కలతో కలసి ప్రారంభించారు. ఈ మేళాలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, సాంకేతిక స్టాళ్లను మంత్రులు సందర్శించి, రైతులతో మమేకమయ్యారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలపై అధికారులు అందిస్తున్న వివరాలను ఆసక్తిగా పరిశీలించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 2022 మే 6న ఇదే మైదానంలో రాహుల్ గాంధీ లక్షలాది మంది సమక్షంలో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. రైతులకు నడిరోడ్డు మీద సంకెళ్లు వేసి చంటి పిల్లలతో నడిపించుకుని పోయిన ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని చెప్పారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ రైతుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంది అన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి పది సంవత్సరాలు తీసుకుంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల లోపే రెండు లక్షల రుణమాఫీ 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని తెలిపారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరే అని ప్రకటిస్తే ప్రజా ప్రభుత్వంలో వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడంతో పాటు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో సంవత్సరానికి రూ.10,000 ఎకరానికి ఇస్తే ప్రజా ప్రభుత్వంలో రైతు భరోసా పేరుతో 12 వేల రూపాయలు అందిస్తున్నామని అన్నారు.
గత ప్రభుత్వం చేసిన అరకొరా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకువచ్చి వ్యవసాయ పనిముట్లను అందిస్తున్నామని అన్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు నిర్వహించే రైతు మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కావ్య, నగర మేయర్ సుధారాణి, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అవినాష్ రెడ్డి, కుడా చైర్మన్, ఇనుగాల వెంకట్రామ రెడ్డి,వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్, హార్టికల్చర్ సెక్రటరీ యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.






