మార్కెటంతా అమ్మేటోళ్లే! లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో వ్యాపారుల ఇష్టారాజ్యం

by Ajay Maddhiboyina |

ప్రజల అవసరాలకు అనుగుణంగా మోడల్‌ మార్కెట్‌ను నిర్మిస్తున్నామన్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ఒక పక్క అధికారులు, మరోపక్క పాలకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో లక్ష్మీపురం మార్కెట్‌ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది.

మార్కెటంతా అమ్మేటోళ్లే! లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో వ్యాపారుల ఇష్టారాజ్యం
X

దిశ, వరంగల్‌ టౌన్: ప్రజల అవసరాలకు అనుగుణంగా మోడల్‌ మార్కెట్‌ను నిర్మిస్తున్నామన్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ఒక పక్క అధికారులు, మరోపక్క పాలకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో లక్ష్మీపురం మార్కెట్‌ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. అసలు మార్కెట్‌ నిర్మాణంలో ప్రణాళికలను పక్కదారి పట్టించినట్లు స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన వారికి నచ్చిన విధంగా పనులు చేపడుతుండడం మార్కెట్‌ స్థాయిని గతంలో కంటే దారుణంగా మార్చేసిందని వినియోగదారులు, పలువురు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. అసలు మార్కెట్‌లో డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడమే మార్కెట్‌ నిర్మాణంపై పాలకులు, అధికారుల్లో ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది. దీనికి తోడు వ్యాపారులకు అనుగుణంగా తీసుకుంటున్న నిర్ణయాలు మార్కెట్‌ అసలు లక్ష్యాన్ని నీరుగార్చుతున్నాయని వినియోగదారులు విమర్శిస్తున్నారు.

అంతా గూడు పుఠాణి!

విశాలమైన స్థలంలో మార్కెట్‌ను నిర్మిస్తారనుకుంటే పిట్టగూళ్లలాగా తయారు చేయడం పాలకులు, అధికారుల వ్యూహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. తొలుత మహిళలను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన గద్దెల ప్రాంగణాన్ని గాలికొదిలేసిన అధికారులు ఆ తర్వాత వ్యాపారుల కోరిక మేరకు అప్పటి ఎమ్మెల్యే అడ్డగోలు నిర్ణయాలతో రేకుల షెడ్లు వెలిశాయి. అధికారం మారిన తర్వాత ఇప్పుడు మరికొందరు తాజా ప్రజాప్రతినిధి అండదండలతో మరిన్ని రేకుల షెడ్లు వేసుకునేందుకు సిద్ధమయ్యారు.

బాట లేకుండా ఎలా?

మార్కెట్‌లో దాదాపు 100కు పైగా గదులు ఉన్నాయి. ఆ గదుల ముందు ఇప్పటికే డేరాలు వేసుకుని కొందరు రిటైల్‌గా కూరగాయలు అమ్ముకుంటున్నారు. మరో పక్క పార్కింగ్‌ ప్లేస్‌లో చిల్లర దుకాణాలు వెలసి వినియోగదారులకు దారి లేకుండా చేస్తున్నారు. వాస్తవానికి పార్కింగ్‌ ప్లేస్‌కు, షాపులకు మధ్య ఉన్న ఖాళీ స్థలం బాటగా గుర్తించారు. కానీ, అడ్తీదారుల పెత్తనం, అధికారులు, పాలకుల అండదండల కారణంగా బాటలో కూడా అమ్మకందారులు విచ్చలవిడిగా డేరాలు కట్టేస్తున్నారు. కాంటాలు పెట్టి దర్జాగా విక్రయిస్తున్నారు. ఇక ఇప్పటివరకు డేరాల కింద సాగుతున్న ఈ వ్యాపారాలు ఇక నుంచి శాశ్వతం కానున్నాయి. అందుకు షాపుల నిర్వాహకులంతా కలిసి మంత్రిని ప్రసన్నం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రేకులు వేసుకునేందుకు భూమి కూడా చూసినట్లు తెలుస్తుండగా, మంచిరోజు చూసుకుని మంత్రి పనులు కూడా ప్రారంభిస్తారని విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే, ఇప్పటికే దారికి ఇరువైపులా చిల్లర దుకాణాల మధ్య కొనుగోలుదారులు నడవడానికి ఇబ్బంది పడుతుండగా, రేకుల షెడ్లు వేస్తే మరింత ఇబ్బంది పడే అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

అక్కడ అమ్మేదెవరు?

మార్కెట్‌లో దాదాపు 100కు పైగా గదులు ఉన్నాయి. వాటిని అడ్తీలకు, కమీషన్‌ వ్యాపారులకు కేటాయించారు. ఆ గదులను వారు తమ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుంది. ఇది మార్కెట్‌ నిబంధన. కానీ, ఆ గదులు(షాపులు) ఎదుట డేరాలు వేసి చిల్లరగా కూరగాయలు అమ్ముతున్నారు. మరి వీరంతా ఎవరు? అడ్తీదారులే రిటైల్‌ వ్యాపారం చేస్తున్నారా? లేదంటే వారి పేరు మీద వేరేవారు అమ్ముకుంటున్నారా? అర్థం కాని పరిస్థితి. ఒకవేళ అడ్తీదారులు చిల్లర వ్యాపారం చేస్తే మార్కెట్‌లో ఇంకా రిటైల్‌గా సరుకులు అమ్ముతున్నదెవరు? ఎంతమంది ఉన్నారనేది అంతుచిక్కని రహస్యంగా మారింది. వాస్తవానికి అడ్తీదారులు, కమీషన్‌ ఏజెంట్లు రైతులు తీసుకొచ్చిన సరుకులను కొనుగోలు చేసి రిటైల్‌ వ్యాపారులకు అమ్ముకుంటారని అందరికీ తెలుసు. కానీ, ఇక్కడ మాత్రం అంతా అగమ్యగోచరంగా ఉంది. అంతా తమదేనని, మా షాపుల ముందు మేమే అమ్ముకుంటున్నామని అడ్తీ, కమీషన్‌ ఏజెంట్లు పేర్కొంటున్నారు. దీంతో అసలు మార్కెట్‌లో ఏం జరుగుతున్నదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మార్కెటంతా వ్యాపారులే.. మరి ఆదాయం?

మార్కెట్‌లో మనిషి నిలబడేంత స్థలం వాడుకున్నా వ్యాపారుల నుంచి మార్కెట్‌ అధికారులు రుసుము వసూలు చేయాల్సిందే. అయితే, షాపుల ముందు సాగుతున్న చిల్లర దుకాణాలకు అధికారులు ఫీజు వసూలు చేస్తున్నారా? లేదా? అనే సందేహాలు కలుగుతున్నాయి. తాము అద్దెకు తీసుకున్న షాపుల ముందు స్థలం తామే వాడుకుంటామని, కొందరు అడ్తీ, కమీషన్‌ వ్యాపారులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఏకంగా రేకుల షెడ్డు వేసుకుని రుసుము చెల్లించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు కూడా వారిని ఏమనే పరిస్థితి లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో నిర్మించిన గద్దెల ప్రాంగణం వృథాగా మారిపోయాయి. వాటి నుంచి వచ్చే ఆదాయం ఏమీ లేకపోగా, ఇప్పుడు వ్యాపారుల ఆగడాలతో రేకులషెడ్ల ద్వారా మార్కెట్‌కు సమకూరే ఆదాయం నయాపైసా లేదనే ప్రచారం జరుగుతోంది. తాజాగా, షాపుల ముందు మళ్లీ రేకులు వేసుకునేందుకు ఏకంగా మంత్రి అనుగ్రహించి, అనుమతులు ఇస్తుండడంతో వాటికి కూడా మార్కెట్‌కు వచ్చే ఆదాయం గుండు సున్నే అని మార్కెట్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తంగా ఆదర్శ మార్కెట్‌ అనే లక్ష్యంతో నిర్మించిన లక్ష్మీపురం మార్కెట్‌ వ్యాపారుల హస్తగతం కానుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వినియోగదారులు ఎదుర్కొనే ఇబ్బందులకు ఎవరు సమాధానం చెబుతారు? ఎవరు మార్కెట్‌ను సరిదిద్దుతారనేది వేచి చూడాల్సిందే.

Next Story