మూతపడుతున్న రైస్​మిల్లులు..ఆందోళనలో యజమానులు

by velandi.Saikiran |   (  Updated:2026-03-10 22:30:47  IST  )

‘కస్టం మిల్లింగ్ రైస్’( సీఎంఆర్) బకాయిలపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. డిఫాల్టర్లపై రెవెన్యూ రికవరీ(ఆర్ఆర్) చట్టాన్ని ప్రయోగిస్తుండడంతో మిల్లర్లలో గుబులు మొదలైంది.

మూతపడుతున్న రైస్​మిల్లులు..ఆందోళనలో యజమానులు
X

‘సీఎంఆర్’ బకాయిలపై సీరియస్ యాక్షన్..!

= ఆర్ఆర్ యాక్ట్, క్రిమినల్ కేసులు నమోదు

= పనిలేక మూతపడుతున్న రైస్​మిల్లులు

= ఆందోళనలో యజమానులు

దిశ, మంగపేట : ‘కస్టం మిల్లింగ్ రైస్’( సీఎంఆర్) బకాయిలపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. డిఫాల్టర్లపై రెవెన్యూ రికవరీ(ఆర్ఆర్) చట్టాన్ని ప్రయోగిస్తుండడంతో మిల్లర్లలో గుబులు మొదలైంది. తాజాగా సోమవారం మంగపేట మండలంలోని నర్సాపురం బోరు గ్రామంలోని సాగి సూర్యనారాయణ రాజుకు చెందిన శ్రీదుర్గా ఆగ్రో ఇండస్ట్రీస్ ఆస్తులను జప్తు చేస్తూ యాజమాన్యానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ధాన్యం పక్కదారి పట్టించి ప్రభుత్వానికి మిల్లర్లు సకాలంలో ‘కస్టం మిల్లింగ్ రైస్’ ఇవ్వకుండా తాత్సారం చేశారనే కారణంతో వారిపై ఆర్ఆర్ చట్టాన్ని ప్రయోగిస్తూ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డిఫాల్ట్​ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్టు, క్రిమినల్ కేసులు, ఐటీ దాడులు ముమ్మరం చేసింది.

ఈ క్రమంలో మిల్లర్లు ప్రభుత్వం తమను ఎలా మోసం చేసిందో కారణాలు చూపుతూ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం డిపాల్ట్​ యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తూ కోర్టుల నుంచి ఉత్తర్వులు పొందుతూ ముందుకెళ్తుంది. ఈ నెల 22 వరకు మిల్లర్లు పెండింగ్ బియ్యం పౌర సరఫరాల శాఖకు అప్పగించాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఓ వైపు కేసులు పెడుతూ మరో వైపు బియ్యం లేదా బకాయిలు చెల్లించాలంటూ మిల్లర్లపై ఒత్తిడి చేస్తుంది. 2011లో హైదరాబాద్ లోని తన రిజిష్ట్రేషన్ భూమి అమ్మి సుమారు రూ.5 కోట్లు పెట్టి మిల్లు నిర్మిస్తే తనను ప్రభుత్వం అడుగడుగునా మోసం చేసిందని, ప్రభుత్వ చర్యలతో తాను సర్వం కోల్పోయానని డిఫాల్ట్​ మిల్లర్ సాగి సూర్యనారాయణ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

అడుగడుగునా అన్యాయం..

2014 నుంచి 2019 వరకు మిల్లును మార్ట్ గేజ్ చేసి బ్యాంకు రుణాలు తీసుకుంటే 4 విడతలుగా రుణం చెల్లించాలంటూ ఆర్డర్ ఇచ్చారని మిల్లర్ సాగి సూర్యనారాయణ రాజు వాపోయాడు. 2019 నుంచి 21 వరకు కరోనా సమయంలో మిల్లులు నడవక మిషనరీ పాడైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2020 కరోనా సమయంలో ప్రభుత్వం బలవంతంగా 183 టన్నుల ధాన్యం దించితే నెలరోజులు కురిసిన భారీ వర్షాలకు ధాన్యం తడిసిపోయిందన్నారు. తడిసిన ధాన్యం సైతం మిల్లులాడించి ప్రభుత్వానికి పంపితే ముక్క ఉందని తిరిగిపంపి తమను మోసం చేసిందని సాగి సూర్యనారాయణ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తనకు విధించి 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ ఎత్తివేయాలని వేడుకున్నారు. మండలంలోని ప్రత్యేక పరిస్థితులతో ఆస్తుల మార్టిగేజ్ కాక, బ్యాంకు రుణాలతో ఎంతో మందికి ఉపాధి కల్పించే మిల్లు మూతపడిందని, మిల్లు మళ్లీ నడిపించుకునేందు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Next Story