పేరుకు పెద్ద రెస్టారెంట్.. అనుమతులు నిల్..?

by velandi.Saikiran |   (  Updated:2026-06-17 13:01:28  IST  )

జనని నర్సింగ్ హోంకు నోటీసులు అందజేసిన మున్సిపల్ అధికారులు, గ్రీన్ రిసార్ట్ కు మాత్రం ఎలాంటి నోటీసులు అందజేయక పోవడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

పేరుకు పెద్ద రెస్టారెంట్.. అనుమతులు నిల్..?
X

దిశ, నర్సంపేట: వడ్డించేవాడు మన వాడైతే ఏ బంతిలో కూర్చున్నా నష్టం ఉండదు అన్నట్లు తయారైంది నర్సంపేట మున్సిపల్ అధికారుల పనితీరు. బిల్డింగ్లకు అనుమతులు లేవు, నిబంధనలు పాటించడం లేదంటూ నర్సంపేట మున్సిపల్ అధికారులకు ఓ వ్యక్తి ఫిర్యాదులు చేశాడు. ఈ క్రమంలో నర్సంపేట పట్టణంలోని జనని నర్సింగ్ హోంకు నోటీసులు అందజేసిన మున్సిపల్ అధికారులు, గ్రీన్ రిసార్ట్ కు మాత్రం ఎలాంటి నోటీసులు అందజేయక పోవడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

పలుకుబడి ఉన్నోళ్లకు ఒకలా, లేనోల్ల పట్ల మరోలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... గ్రీన్ రిసార్ట్, జనని నర్సింగ్ హోంకు ఉన్న అనుమతులపై ఆరా తీసేందుకు..మే 19వ తేదీన శ్రీనివాస్ అనే వ్యక్తి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన త‌రుణంలో ఈ రెండిటిలో ఒకరికి మాత్ర‌మే నోటీసులు అందజేసిన మున్సిపల్ సిబ్బంది, గ్రీన్ రిసార్ట్ కు మాత్రం నోటీసులు అందజేయలేదు. దీనిపై ఇప్పుడు వివాదం రాజుకుంది.

ట్రేడ్ లైసెన్స్ నిల్..!

నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామం ఇటీవల నర్సంపేట మున్సిపాల్టీలో చేరింది. మహేశ్వరం పరిధిలో ఉన్న గ్రీన్ రిసార్ట్ బిల్డింగ్ కి అనుమతులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఐతే ట్రేడ్ లైసెన్స్ లేనట్లు తెలుస్తోంది. ఫుడ్ అండ్ సెక్యూరిటీ కి సంబంధించి రెండేళ్లకు అనుమతి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం మళ్లీ ఎలాంటి అనుమతులు తీసుకోన్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుమతులు పరిశీలించాలని మున్సిపల్ అధికారులను కోరినప్పటికీ అలాంటి చర్యలకు అధికార సిబ్బంది ధైర్యం చేయకపోవడం అనుమానాలకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో గ్రీన్ రిసార్ట్ అనుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏదేమైనప్పటికీ మున్సిపాలిటీ పరిధిలో వచ్చిన రెండు పిర్యాదులకు ఒకరికి నోటీసులు పంపి మరొకరికి పంపకపోవడం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. రిసార్ట్ అనుమతులు సైతం చెక్ చేసి నిజానిజాలు బయటపెట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Next Story