SEBI: ఏఐ వినియోగానికి సెబీ గైడ్‌లైన్స్

by S Gopi |   (  Updated:2026-06-17 14:28:22  IST  )

మార్కెట్లో ఏఐని బాధ్యతాయుతంగా ఎలా వాడాలో స్పష్టం చేస్తూ సెబీ త్వరలో సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

SEBI: ఏఐ వినియోగానికి సెబీ గైడ్‌లైన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత మూలధన మార్కెట్లలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని నియంత్రించడానికి 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (సెబీ) ఒక సమగ్రమైన, స్పష్టమైన నియంత్రణ వ్యవస్థను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఏఐ ఆధారిత టూల్స్ మార్కెట్ పర్యవేక్షణ, రిస్క్ అంచనా, మోసాల గుర్తింపు, పెట్టుబడిదారులకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వాటి వినియోగంతో కొన్ని కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. ముఖ్యంగా పారదర్శకత లోపించడం, పక్షపాత నిర్ణయాలు, డేటా లీకేజీలు, సైబర్ సెక్యూరిటీ ముప్పు, జవాబుదారీతనం లేకపోవడం వంటి సరికొత్త ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే, మార్కెట్లో ఏఐని బాధ్యతాయుతంగా ఎలా వాడాలో స్పష్టం చేస్తూ సెబీ త్వరలో సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

సెబీ ఈ ఏఐ వ్యూహాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నట్లు తుహిన్ కాంత పాండే చెప్పారు. ఇందుకోసం అంతర్జాతీయ సెక్యూరిటీస్ కమిషన్ల సంస్థ (ఐఓఎస్‌సీఓ) రూపొందించిన ఏఐ పర్యవేక్షణ టూల్‌కిట్‌ను భారత పరిస్థితులకు అనుగుణంగా అనుసంధానించనున్నట్లు తెలిపారు. కేవలం తాత్కాలిక నిబంధనలతో సరిపెట్టకుండా, దేశీయ స్టాక్ మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థల కోసం రాబోయే ఐదేళ్లు, పదేళ్ల కాలానికి ఒక పటిష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఇచ్చే సిఫార్సుల ఆధారంగానే సెబీ తన తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు.

Next Story