- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మామిడిగుండాల సీలింగ్ భూములకు పట్టాలు ఇవ్వాలి.. అఖిలపక్ష నాయకుల డిమాండ్
దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతులకు మామిడిగుండాల ప్రాంతంలోని సీలింగ్ భూములకు పట్టాలు మంజూరు చేయాలని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు.

దిశ, ఇల్లెందు: దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతులకు మామిడిగుండాల ప్రాంతంలోని సీలింగ్ భూములకు పట్టాలు మంజూరు చేయాలని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చంద్ర కృష్ణమూర్తి విజ్ఞాన భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ, నెమరుగమ్ముల రాఘవేంద్రరావుకు చెందిన సుమారు 4,000 ఎకరాల సీలింగ్ భూముల్లో ఇప్పటికే 2,500 ఎకరాలను ఆ ప్రాంతంలో సాగు చేస్తున్న రైతులకు కేటాయించారని తెలిపారు. మిగిలిన భూములను కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హులైన సాగుదారులకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ సమస్య పరిష్కారం కోసం అనేక సంవత్సరాలుగా రైతులు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూములకు స్పష్టమైన హద్దులు లేకపోవడంతో ఈ ప్రాంతానికి సంబంధం లేని కొందరు వ్యక్తులు భూములపై హక్కులు తమవేనంటూ రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతులకు కేటాయించిన భూములకు సరిహద్దులు నిర్ధారించి, హక్కుదారు పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై దశలవారీగా ఆందోళనలు చేపడతామని, స్థానిక తహసీల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌లను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు నబీ భాస్కర్, లక్ష్మయ్య, సంజీవ్, సిలివేరి సత్యనారాయణ, వీరభద్రం, కృష్ణ, రాంబాబు, ఆర్.ఎస్. బోస్ తదితరులు పాల్గొన్నారు.






