నకిలీ పత్తి విత్తనాల విక్రయతలపై పోలీసుల ఉక్కుపాదం

by Taduka Kalyani |

మంచిర్యాల జిల్లా కేంద్రంగా నకిలీ పత్తి విత్తనాల దందాను నడిపిస్తున్న విక్రతపై బుధవారం పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు.

నకిలీ పత్తి విత్తనాల విక్రయతలపై పోలీసుల ఉక్కుపాదం
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంగా నకిలీ పత్తి విత్తనాల దందాను నడిపిస్తున్న విక్రతపై బుధవారం పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిడి చట్టాన్ని అమలు చేసినట్లు ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన పూస.సుబ్బారావు గత 2021 నుండి 2025 వరకు 5 సంవత్సరాలుగా నకిలీ పత్తి విత్తనాల రవాణా, నిలువ విక్రయాలు చేస్తున్నట్లు తెలిపారు. నిందితునిపై 2021 లో పిడీ చట్టం కింద కేసు నమోదయిందన్నారు. తన వైఖరి మార్చుకోకుండా మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో 9 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నకిలీ పత్తి విత్తనాలను తీసుకువచ్చి రైతులను మోసం చేస్తున్నాడన్నారు. జిల్లాలోని తాండూర్, భీమారం, భీమిని, బెల్లంపల్లి టూ టౌన్, నెన్నెల, చెన్నూరు మండలాలలో ఏజెంట్లను నియమించి నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. తాండూర్ సీఐ దేవయ్య, ఎస్సై ప్రసాద్ నిందితుడికి పిడి ఉత్తర్వులను అందజేసి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు తెలిపారు. మా యొక్క రైతులకు నకిలీ పత్తి విత్తనాలను విక్రయించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని తెలిపారు. అక్రమ నకిలీ విత్తనాల తయారీ, అక్రమ రవాణాకు పాల్పడిన నేరస్థుడిపై పిడి చట్టం అమలకు కృషిచేసిన బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, ఎస్సై ప్రసాద్ లను సిపి అభినందించారు.

Next Story