గిల్, ఇషాన్ కిషన్ సెంచరీల సునామీ.. ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ భారీ విజయం

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-17 16:13:51  IST  )

లక్నో వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్ 170 పరుగుల తేడాతో ఓడించింది.

గిల్, ఇషాన్ కిషన్ సెంచరీల సునామీ.. ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ భారీ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: సొంతగడ్డపై టీమిండియా (Team India) విజయ దుంధుభి మోగించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో లక్నో వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేసి 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీలతో ఆఫ్ఘన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు.

402 పరుగుల టార్గెట్..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన యశస్వి జైస్వాల్ 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అయితే, మరో ఓపెనర్ రోహిత్ శర్మ (48) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (110 బంతుల్లో 154 పరుగులు, 22 ఫోర్లు, 2 సిక్సర్లు) క్లాస్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. అతనికి జతకలిసిన ఇషాన్ కిషన్ (79 బంతుల్లో 125 పరుగులు, 14 ఫోర్లు, 7 సిక్సర్లు) వన్డేల్లో మూడేళ్ల తర్వాత సంచలన సెంచరీతో అదరగొట్టాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు ఏకంగా 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లక్నోలోని తీవ్రమైన ఉష్ణోగ్రత, ఉక్కపోతను తట్టుకుంటూ ఇద్దరూ ఒకే ఓవర్లో సెంచరీలు పూర్తి చేయడం విశేషం. ఆఖర్లో వరుసగా వికెట్లు పడినా, భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరుకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘన్ బౌలర్లలో నాంగ్యాలియా ఖరోటే 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు.

కుప్పకూలిన ఆఫ్ఘన్ మిడిలార్డర్..

కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు భారత బౌలర్లు మొదటి నుంచే కట్టడి చేశారు. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (41), సెదికుల్లా అటల్ (42) కాసేపు నిలబడటానికి ప్రయత్నించినా.. మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. వన్డౌన్ బ్యాటర్ రహ్మత్ షా ఒంటరి పోరాటం చేస్తూ 77 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. చివరకు ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, గుర్నూర్ బ్రార్ 3 రాణించగా, యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. సూపర్ సెంచరీతో భారత్‌కు భారీ స్కోరు అందించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Next Story