ఎన్టీఆర్ విగ్రహం దహనం చేసిన నిందితులు అరెస్ట్..

by Kodari Anjali |

ఎన్టీఆర్ విగ్రహం దహనం ఘటనను నల్లగొండ టూ టౌన్ పోలీసులు ఛేదించారు.

ఎన్టీఆర్ విగ్రహం దహనం చేసిన నిందితులు అరెస్ట్..
X

దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణంలో జూన్ 6వ తేదీ తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎన్టీఆర్ విగ్రహం దహనం ఘటనను నల్లగొండ టూ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ రోడ్డు ఎన్.జి. కళాశాల సమీపంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనపై మున్సిపల్ 48వ వార్డు అధికారి బుజనూరి స్వప్న ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద టూ టౌన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటుతో నల్లగొండ సీసీఎస్, టూ టౌన్ పోలీసుల సంయుక్త బృందాలు సంఘటన స్థలం పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి అనుమానాస్పద వాహనాల కదలికలు, సాంకేతిక ఆధారాలు తో నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలను లక్ష్యంగా చేసుకుని వాటిని ధ్వంసం చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు.

ముందస్తుగా తెచ్చుకున్న రెండు పాత బెడ్‌షీట్లను..

ఈ కుట్రలో భాగంగా మొదట నల్లగొండలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంపిక చేసుకుని, సంఘటనకు ముందు అక్కడి పరిస్థితులను పరిశీలించి, దాడికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసినట్లు దర్యాప్తులో బయటపడిందన్నారు.జూన్ 6వ తేదీ తెల్లవారుజామున సుమారు 3:45 గంటల సమయంలో నిందితులు పాలకురి అశోక్ కుమార్ గౌడ్‌కు చెందిన బలెనో కారులో నల్లగొండకు చేరుకున్నారు. ముందస్తుగా తెచ్చుకున్న రెండు పాత బెడ్‌షీట్లను ఎన్టీఆర్ విగ్రహంపై కప్పి, ఒక లీటర్ పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసులో నిందితులైన పాలకురి అశోక్ కుమార్ గౌడ్, ఎలుకంటి ప్రణీత్ లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన బలెనో కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన డీఎస్పీ ,టూ టౌన్ సీఐ ఎస్. రాఘవరావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు డి. చంద్రశేఖర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రూరల్ ఎస్‌ఐ డి. సైదాబాబు, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, సీసీఎస్ సిబ్బంది పుష్పగిరి, శివరాజు, సాయి, నరేశ్, నాగార్జున, కమల్, టూ టౌన్ సిబ్బంది బాలకోటి, షకీల్, శంకర్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Next Story