- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉస్మానియా యూనివర్సిటీకి నాలుగు ఐఎస్ఓ సర్టిఫికేషన్లు
ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే తొలిసారిగా ఒకేసారి నాలుగు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఐఎస్ఓ సర్టిఫికేషన్లను భారత ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి పొందిన తొలి విశ్వవిద్యాలయంగా రికార్డు సృష్టించింది. విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలోని సెనేట్ హాలులో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సర్టిఫికెట్లను బీఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (సదరన్ రీజియన్) & సైంటిస్ట్ ‘ఎఫ్’ సందీప్ కుమార్ కనోజియా అధికారికంగా అందజేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా సంస్థల నిర్వహణ వ్యవస్థ (ఐఎస్ఓ 21001:2018), పర్యావరణ నిర్వహణ వ్యవస్థ (ఐఎస్ఓ 14001:2015), ఇంధన నిర్వహణ వ్యవస్థ (ఐఎస్ఓ 50001:2018), ఆహార భద్రత నిర్వహణ వ్యవస్థ (ఐఎస్ఓ 22000:2018) విభాగాల్లో ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా..
విద్యా నాణ్యత, పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు, ఆహార భద్రత రంగాల్లో విశ్వవిద్యాలయం పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలకు గుర్తింపుగా ఈ సర్టిఫికేషన్లు లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగారం మాట్లాడుతూ, భారతీయ విశ్వవిద్యాలయాల చరిత్రలో ఇది ఒక అరుదైన ఘట్టమన్నారు. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం గత విజయాలతోనే సంతృప్తి చెందకుండా, అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకుంటూ భవిష్యత్ సవాళ్లకు సిద్ధమవుతోందని పేర్కొన్నారు. ముఖ్య అతిథి సందీప్ కుమార్ కనోజియా మాట్లాడుతూ, ఈ సర్టిఫికేషన్లు సాధించడం గొప్ప విజయమే అయినప్పటికీ, నాణ్యతా ప్రమాణాల ప్రయాణానికి ఇది ఆరంభం మాత్రమేనని, వాటిని నిరంతరం కొనసాగించడం మరింత ముఖ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఐఎస్ అధికారులు, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య జి. నరేష్ రెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ ఆచార్య బి. శిరీష తదితరులు పాల్గొన్నారు.






