- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాజెక్టుల్లో డీసిల్టేషన్.. శాస్త్రీయ పద్ధతిలో పూడిక తొలగింపు
రాష్ట్రంలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు, జలాశయాల్లో పూడిక తొలగింపు (డీసిల్టేషన్) కోసం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో జలాశయాలు, ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు, జలాశయాల్లో పూడిక తొలగింపు (డీసిల్టేషన్) కోసం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో జలాశయాలు, ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన జలాశయాల్లో అసలు నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు అన్ని చర్యలూ చేపట్టాలన్నారు. జలాశయాల నిల్వ సామర్థ్యం పెంపుతో నీటి భద్రత మెరుగుపడటంతోపాటు సాగునీటి విస్తీర్ణం పెరుగుతుందని.. వరద ముప్పు కూడా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పూడిక తొలగింపు నమూనాలను సమగ్రంగా అధ్యయనం చేసి తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా ఉత్తమ విధానాలను గుర్తించాలన్నారు. అంతేగాకుండా జలాశయాల్లో పూడిక నిర్వహణ, పూడిక తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ మార్గదర్శకాలు, విధానాలను కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను ప్రస్తావిస్తూ, పూడిక తొలగింపు వంటి నివారణ చర్యలను నిర్లక్ష్యం చేయడంతో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. గతేడాది పంజాబ్ రాష్ట్రంలో సంభవించిన తీవ్ర వరదల కారణంగా 22 జిల్లాల్లో 16 జిల్లాలు ముంపునకు గురయ్యాయని.. నష్టపరిహారం, పునరుద్ధరణ చర్యలకు దాదాపు రూ.2వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు.
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలోని మంగళం ఆనకట్టలో 2017లో చేపట్టిన పూడిక తొలగింపు కార్యక్రమాన్ని విజయవంతమైన నమూనాగా మంత్రి ప్రస్తావించారు. కడెం ప్రాజెక్టులో పూడిక తొలగింపు పనులు చేపడుతున్న సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి సమీక్షించారు. అలాగే లోయర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు రిజర్వాయర్‌లలో జరుగుతున్న పూడిక తొలగింపు పనుల పురోగతిని సైతం చర్చించారు. పనుల్లో వేగాన్ని పెంచేందుకు, కార్యాచరణలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ఆచరణాత్మక పరిష్కారాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్టుల ప్రధాన ఇంజినీర్లు ఆయా ప్రాజెక్టుల్లో పూడిక పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసి, కోల్పోయిన నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు చేపట్టగల చర్యలపై నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. జలాశయాల నిర్వహణలో శాస్త్రీయ, దీర్ఘకాలిక దృక్పథాన్ని అవలంబించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని జలాశయాల్లో పూడిక తొలగింపు కార్యక్రమానికి ఈఎన్సీ (ఓఅండ్ఎం) నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్, ఈఎన్సీ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.






