CAG: రాష్ట్రాల ఆదాయంతో పాటు అప్పులూ పెరుగుతున్నాయ్

by S Gopi |

ప్రజల జీవన ప్రమాణాలు పెంచే సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం వల్లే ఈ స్థాయిలో ఖర్చులు పెరిగాయని నివేదిక స్పష్టం చేసింది.

CAG: రాష్ట్రాల ఆదాయంతో పాటు అప్పులూ పెరుగుతున్నాయ్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోందని, అవి తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదిక ‘స్టేట్ ఫైనాన్సెస్ 2024-25’ స్పష్టం చేసింది. కాగ్ అధినేత కె సంజయ్ మూర్తి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025 మార్చి చివరి నాటికి దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల ఉమ్మడి అప్పుల భారం అక్షరాలా రూ. 90.51 లక్షల కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అన్ని రాష్ట్రాలూ ‘ఆర్థిక లోటు’ (ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉండటం) నమోదు చేయడం గమనార్హం. ఇందులో 15 రాష్ట్రాల ఆర్థిక లోటు అయితే, ఆయా రాష్ట్రాల సొంత జీఎస్‌డీపీలో ఉండాల్సిన 3 శాతం పరిమితిని దాటేసిందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

పదేళ్లలో 131 శాతం పెరిగిన వ్యయం.. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం

2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 22.18 లక్షల కోట్లుగా ఉన్న అన్ని రాష్ట్రాల ఉమ్మడి వ్యయం, 2024-25 నాటికి ఏకంగా రూ. 51.20 లక్షల కోట్లకు చేరింది. అంటే పదేళ్ల కాలంలో రాష్ట్రాల ఖర్చు 131 శాతం మేర పెరిగింది. ఈ మొత్తం ఖర్చులో దాదాపు మూడింట రెండు వంతుల (సుమారు 67 శాతం) నిధులను సామాజిక, ఆర్థిక రంగాల సంక్షేమానికే ఉపయోగించడం విశేషం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం వల్లే ఈ స్థాయిలో ఖర్చులు పెరిగాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రజలకు నేరుగా ఉపయోగపడే రంగాలలో విద్యకు అత్యధిక నిధులు కేటాయించారు. ఆ తర్వాతి స్థానాల్లో సామాజిక సంక్షేమం, విద్యుత్ (ఇంధన) రంగాలు నిలిచాయి. అయితే, ఈ ఖర్చుల వృద్ధి దేశ ఆర్థిక వృద్ధి రేటుకు అనుగుణంగానే సాగిందని, రాష్ట్రాల మొత్తం బడ్జెట్ వ్యయం వాటి ఉమ్మడి జీడీపీ (జీఎస్‌డీపీ)లో 15.78 శాతం నుంచి 17.49 శాతం మధ్య స్థిరంగా నమోదవుతోందని కాగ్ పేర్కొంది.

జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలకే బడ్జెట్ స్వాహా

రాష్ట్రాల ఆదాయం బాగున్నా.. వస్తున్న డబ్బులన్నీ నిత్య అవసరాలకే సరిపోతుండటం పెద్ద సవాలుగా మారింది. గతేడాది అన్ని రాష్ట్రాలు కలిపి చేసిన మొత్తం బడ్జెట్ ఖర్చు రూ. 51.20 లక్షల కోట్లు కాగా, అందులో దాదాపు 80 శాతం కేవలం ప్రభుత్వ నిర్వహణ (రెవెన్యూ వ్యయం) కోసమే సరిపోయింది. మరీ ముఖ్యంగా.. ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ సిబ్బంది పెన్షన్లు, అప్పులకు కట్టే వడ్డీల వంటి ‘తప్పనిసరి బాధ్యతల’కే బడ్జెట్‌లో 43 శాతం కంటే ఎక్కువ సొమ్ము ఖర్చయిపోతోంది. ఈ ఖర్చు నాగాలాండ్‌లో అత్యధికంగా 74 శాతం ఉంటే, మహారాష్ట్రలో అత్యల్పంగా 29 శాతంగా ఉంది. వీటికి తోడు సబ్సిడీలు, ఉచిత పథకాలు, గ్రాంట్లు అన్నీ కలుపుకుంటే మొత్తం ఖర్చులో 61 శాతం ఇక్కడే కరిగిపోతోంది. కేవలం ఉచితాలు, సబ్సిడీలకే 10 శాతం బడ్జెట్ అయిపోతోంది. దీనివల్ల 13 రాష్ట్రాలు తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కొంటున్నాయని, కొన్ని రాష్ట్రాల్లో ఖజానాలో నిల్వలున్నా రోజువారీ ఖర్చుల కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) దగ్గర అత్యవసర రుణాలు తీసుకోవాల్సి వస్తోందని కాగ్ పేర్కొంది.

సొంత పన్నులతోనే నెట్టుకొస్తున్న రాష్ట్రాలు

మరోవైపు, కేంద్రం నుంచి వచ్చే సహాయం లేదా గ్రాంట్లపై ఆధారపడటం తగ్గించుకుని, రాష్ట్రాలు తమ సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం ఒక సానుకూల అంశం. గతేడాది వచ్చిన మొత్తం రూ. 40.52 లక్షల కోట్ల రెవెన్యూలో.. సగం ఆదాయం రాష్ట్రాల సొంత పన్నుల ద్వారానే సమకూరింది. ఇందులో రాష్ట్ర జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ) వాటానే 43 శాతానికి పైగా ఉండటం విశేషం. జీఎస్టీ రాకముందుతో పోలిస్తే ఇప్పుడు పన్ను వసూళ్లలో వార్షిక వృద్ధి గణనీయంగా మెరుగైంది. గత పదేళ్లలో రాష్ట్రాల సొంత పన్నుల ఆదాయం రూ. 8.40 లక్షల కోట్ల నుంచి రూ. 20.31 లక్షల కోట్లకు.. అంటే రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగిందని కాగ్ నివేదిక వెల్లడించింది.

Next Story